తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఐదేళ్ళలో ఏమీ చేయకుండా ఇఫ్పుడు అమరావతిలో పర్యటించి ఏమి చేస్తారని ప్రశ్నించారు. బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఇంకేమీ కట్టలేదని అన్నారు. రాజధాని పేరుతో రైతులను ముంచారని, అందుకే ఆయన్ను ఇంట్లో కూర్చొపెట్టారని ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో మోసపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటామని చెప్పారు. ఎంత మందికి ప్లాట్లు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారని తెలిపారు. ఇటీవలే ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడు వచ్చి వెళ్లాడు..ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళతారట. ఐదేళ్లు చంద్రబాబు ఏమైనా గొర్రెలు కాశారా అని ఆయన ప్రశ్నించారు.
ఆయనకు ఓటు వేసింది ఐదేళ్ల పాలనకేనని ఆయన అన్నారు. ఆ టైమ్ లో చేయగలిగినవి చేయాలి కదా అన్నారు. అలాకాకుండా ఐదు శాతం చేసి ,మిగిలింది మీరు చేయండి అంటే ఏమి చేయాలని బొత్స ప్రశ్నించారు. ద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఎనిమిదిన అమరావతిలో పర్యటిస్తారని వార్తలు వచ్చిన నేపద్యంలో బొత్స స్పందించారు. తొలుత తాను ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారో రైతులకు చెప్పాలని ఆయన అన్నారు. తొమ్మిదివేల కోట్ల బడ్జెట్ కు 4900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన అన్నారు. ఆయన ఏభై ఏళ్లు పాలన చేస్తానని అనుకున్నారా అని బొత్స ఎద్దేవా చేశారు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవటం చంద్రబాబుకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. తాము తెలుగుకు వ్యతిరేకం కాదన్నారు.