ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు మొదలయ్యాయి. తొలి విడతలో పది వేల రూపాయల లోపు ఉన్న వారి కోసం 264 కోట్ల రూపాయల వారి ఖాతాల్లో జమ చేశారు. దీని ద్వారా 3.70 లక్షల మంది ప్రయోజనం పొందనున్నారు. తర్వాత దశలో 20 వేల రూపాయల వరకూ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారికి చెల్లింపులు చేయనున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ చెల్లింపుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తున్నందకు ఆనందంగా ఉందని అన్నారు. చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిన బాధితులకు న్యాయం జరగలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాటం చేశామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడుతున్నామని తెలిపారు.
‘మీ అందరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మీ ముందు నిలబడ్డాను. 3,648 కి.మీ సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను విన్నాను. నేను ఉన్నానని మాట ఇచ్చాను. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశాను. కోర్టు పరిధిలో ఉన్నా.. తొలి విడతలో భాగంగా దాదాపుగా 3.70లక్షల మంది బాధితులకు న్యాయం చేస్తున్నాం. రూ. 10వేలలోపు డిపాజిట్లు ఉన్న బాధితులను ఆదుకునేందుకు రూ. 264 కోట్లు విడుదల చేశాం. అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌లోనే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు కేటాయింపులు చేశాం. ఐదు నెలల్లోపే బాధితులకు న్యాయం చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింత మందికి న్యాయం చేస్తాం. త్వరలోనే రూ. 20వేలలోపు డిపాజిట్ చేసినవారికి డబ్బులు అందజేస్తాం.
ఈ ఐదు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. గ్రామా సచివాలయాల ద్వారా లక్ష 30వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. 2.25 లక్షల మంది ఆటో కార్మికులకు.. వైఎస్సార్ వాహన మిత్ర అందించాం. పాదయాత్రలో చెప్పిన విధంగా ప్రతి రైతన్నకు రైతు భరోసా అందించాం. అప్పుడు రూ. 12,500 రైతులకు ఇస్తామని చెప్పిన.. దానిని రూ. 13,500కు పెంచాం. అవ్వాతాతల పెన్షన్ కోసం రూ. 1350 కోట్లు మంజూరు చేశాం. గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు అధికంగా పించన్ ఇస్తున్నాం. 65 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి వెలుగు అందిస్తున్నాం. 4.5 లక్షల మంది విద్యార్థులక శస్త్ర చికిత్సల చేయించడం, కంటి అద్దాలు అందజేయడం చేశామన్నారు. ఎవరైనా అగ్రిగోల్డ్ బాధితుల తమ పేర్లు నమోదు చేసుకోలేకపోయి ఉంటే వారికి మరో అవకాశం కల్పించనున్నట్లు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.