జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు భరోసా స్కీమ్ వ్యవహారంపై స్పందించారు. ఈ పథకాన్ని ప్రధాని కిసాన్ యోజనతో కలిపి అమలు చేయటంతో అసలు పథకం లక్ష్యం దెబ్బతిన్నట్లు అవుతోందని పేర్కొన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఏటా 12500 రూపాయలు ఇస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. నవరత్నాలతోపాటు..ఎన్నికల ప్రణాళికలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు కదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులతో కలిపి రైతు భరోసా కింద 13500 రూపాయలు ఇస్తామని ప్రకటించటం ఎంత వరకు సబబు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నవరత్నాలను ప్రకటించినప్పుడు కేంద్ర పథకంతో కలిపి అమలు చేస్తామని ఎందుకు చెప్పలేదు?.
రైతులకు ఇచ్చిన హామీ ఏటా 12500 రూపాయలతోపాటు కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి మొత్తం 18500 రూపాయలు ఇవ్వాలని జనసేన అధినేత డిమాండ్ చేశారు. ఒక వేళ ఆ పని చేయలేకపోతే అందుకు కారణాలను వివరించి..రైతులను క్షమాపణ కోరాలని సూచించారు.అధికారంలోకి వచ్చిన పార్టీ తన ఎన్నికల ప్రణాళికను తూచ తప్పకుండా అమలు చేయాలన్నది సహజ న్యాయసూత్రం అని పేర్కొన్నారు. లబ్దిదారుల ఎంపికలో కూడా గందరగోళం నెలకొందని పవన్ తన ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రంలో ఈ పథకానికి అర్హులు 86 లక్షల వరకూ ఉంటే..దీన్ని 40 లక్షల మందికే పరిమితం చేయటం సరికాదన్నారు. భరోసా మొత్తాన్ని మూడు విడతల్లో కాకుండా ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు అందజేయాలని పవన్ కళ్యాణ్ కోరారు.