టీడీపీలో ‘వల్లభనేని వంశీ’ కలకలం

Update: 2019-10-25 12:53 GMT

శుక్రవారం ఉదయం కేంద్ర మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ సుజనా చౌదరితో భేటీ. సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అరగంట పాటు సమావేశం. అది కూడా ఏకంగా మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలసి. ఇదీ గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరు. ఈ పరిణామం ప్రతిపక్ష టీడీపీ లో కలకలం రేపుతోంది. గట్టి పోటీ ఉన్న దశలోనూ గన్నవరం సీటును వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో దక్కించుకోగలిగారు. ఇప్పుడు అదే వంశీ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముందు బిజెపి అన్నారు..తర్వాత జగన్ తో అరగంట భేటీ కావటంతో అసలు వంశీ మనసులో ఏముంది అన్న కన్ఫ్యూజన్ ఆ పార్టీ నేతల్లో ఏర్పడింది. శుక్రవారం నాడు సర్కారు ఇసుక సరఫరాలో విఫలమైందని ఆరోపిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు..నిరసనలకు శ్రీకారం చుట్టింది.

అయితే వంశీ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా వరస భేటీలతో రాజకీయంగా కాకరేపారు. అయితే ఎవరు పార్టీలోకి వచ్చినా రాజీనామా చేసి రావాల్సిందే అని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ఎంతో విస్పష్టంగా ప్రకటించారు. మరి ఈ తరుణంలో వంశీ రాజీనామా చేసి మరోసారి పోటీకి దిగుతారా? లేక అలా నిత్యం చంద్రబాబుకు చికాకు పెట్టిస్తూ టీడీపీలో ఉంటూనే అంటీముట్టనట్లు వ్యవహరిస్తారా? అన్నది వేచిచూడాల్సిందే అని చెబుతున్నారు. ఎన్నికలకు ముందే వంశీ వైసీపీలోకి వెళతారని కూడా ప్రచారం జరిగింది.

 

Similar News