హుజూర్ నగర్ లో సైదిరెడ్డి ‘రికార్డు గెలుపు’

Update: 2019-10-24 09:11 GMT

కాంగ్రెస్ కంచుకోటను టీఆర్ఎస్ బద్దలు కొట్టింది. అది కూడా అలా ఇలా కాదు. ఎవరూ ఊహించని రీతిలో ‘రికార్డు’ మెజారిటీతో హుజూర్ నగర్ అసెంబ్లీ సీటును చేజిక్కుంచుకుంది. వాస్తవంగా ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత సీటును భార్యకు ఇప్పించుకుని కూడా గెలిపించుకోలేకపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ గానే పరిగణించాల్సి ఉంటుంది. బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు అయిన బిజెపి, టీడీపీ డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి 43,233 ఓట్లతో ఘన విజయం దక్కించుకున్నారు.

హుజూర్ నగర్ లో టీఆర్‌ఎస్‌ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పద్మావతి ఉత్తమ్‌రెడ్డి, బీజేపీ తరఫున రామారావు బరిలో ఉన్నారు. సోమవారం జరిగిన పోలింగ్‌లో నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండల్లాలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో 2,00,754 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో మొత్తం 28 మంది పోటీ పడ్డారు. ఇప్పటివరకు ఏడు సార్లు జరిగిన హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ఫలితాల్లో.. 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీ నమోదైంది. ఇప్పుడు భారీ మెజారిటీని సాధించటం ద్వారా సైదిరెడ్డి పాత రికార్డును బ్రేక్ చేశారు.

 

Similar News