జనసేన ‘లాంగ్ మార్చ్’ కు టీడీపీ మద్దతు

Update: 2019-10-31 13:46 GMT

ఏపీలో ఇసుక కొరతపై జనసేన తలపెట్టిన విశాఖపట్నం ‘లాంగ్ మార్చ్’ కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఇందులో తమ పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. గురువారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యలపై పోరాడే పార్టీలు తమ మద్దతు కోరితే ఖచ్చితంగా తాము కూడా అందులో పాల్గొంటామని తెలిపారు. ఒక్క జనసేనే కాదు..ఏ పార్టీ తో అయినా ప్రజా సమస్యలపై కలసి పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఏపీలో ఇసుక కొరత వల్ల జరిగిన ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక అంతా ఏమైపోతోందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు తరలిపోవటం వల్లే ఏపీలో ఇసుక కొరత ఏర్పడుతోందని ఆరోపించారు. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన కూలీలను హేళన చేసేలా కొంత మంది మంత్రులు మాట్లాడటం దారుణం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మీడియాను అణచివేసేందుకు తీసుకొచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీని కోసం టీడీపీ తన వంతు పోరాటం చేస్తుందని తెలిపారు. తమ పార్టీపై..ప్రభుత్వంపై సాక్షి ఎన్ని అసత్య కథనాలు ప్రచురించింది..తాము పెట్టదలచుకుంటే ఎన్ని కేసులు పెట్టాలి అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తోందని..ఏకంగా జాతీయ జెండాను అవమానించేలా ప్రభుత్వ కార్యాలయానికి ఉన్న జాతీయ జెండాను తొలగించి..వైసీపీ రంగులు వేశారని ఫోటోలను ప్రదర్శించారు. వైసీపీ పార్టీ రంగులు జాతీయ జెండా కంటే గొప్పవా? అని ప్రశ్నించారు. జాతీయ జెండాను అవమానించిన వారిపై కేసులు బుక్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Similar News