మెగా స్టార్ చిరంజీవి. తన కెరీర్ లో ఇప్పటివరకూ చేసిన సినిమాలు 150. 151 సినిమానే సైరా నరసింహరెడ్డి. చిరు ఇప్పటివరకూ చేసిన 150 సినిమాల్లో మెజారిటీ సినిమాలు పక్కా కమర్షియల్ సినిమాలే. ఇన్ని కమర్షియల్..మాస్..మసాలా సినిమాలు చేసిన చిరంజీవి ఒక్క సారిగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేయటం అంటే ఓ రకంగా సాహసమే అని చెప్పుకోవాలి. ఆయా సినిమా హీరోల ప్రేక్షకుల వాళ్ళను ఆయా పాత్రల్లో చూసి ఎంజాయ్ చేయటానికే ఇష్టపడతారు. ఎప్పుడైనా రూటు మార్చితే వాటిని ఎలా స్వీకరిస్తారు అన్నది చాలా కీలకం. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి అదే పని చేశారు సైరా నరసింహరెడ్డి సినిమాతో. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బుధవారం నాడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ తారాగణం..భారీ అంచనాలతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే పెరిగిన హైప్ ను అందుకోవటంలో సైరా నరసింహరెడ్డి విఫలమైందనే చెప్పాలి.
బ్రిటీషర్ల విధానమే విభజించు..పాలించు. అందరూ కలసి ఉంటే తమకు ముప్పు వస్తుందనని విడగొట్టి పాలించే విధానాన్ని బ్రిటీషర్లు అమలు చేసిన సంగతి తెలిసిందే రాయలసీమ ప్రాంతంలోని 61 మంది పాలేగాళ్ళ సంస్థానాలు..వాళ్ళలో అనైక్యతను అడ్డుపెట్టుకుని బ్రిటీషర్ల ఆగడాలు. వీటిని అడ్డుకుంటూ..పాలేగాళ్ళ మధ్య ఐక్యత తెచ్చేందుకు సైరా నరసింహరెడ్డి చేసే ప్రయత్నాలే సినిమా కథ. ఈ కథను..ముఖ్యంగా సైరా నరసింహరెడ్డి గురించి ఈ సినిమాలో లక్ష్మీ బాయి (అనుష్క)తో చెప్పించారు. అనుష్క పాత్ర నిడివి చాలా తక్కువే అయినా ఉన్నంతలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా స్లోగా సినిమా కదులుతుంది. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు..యుద్ధాలే సినిమాలో కీలకం. చిరంజీవి ఈ వయస్సులోనూ యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ చూపించాడనే చెప్పాలి. ఈ సినిమాలో ఇతర కీలకపాత్రలు పోషించిన అమితా బచ్చన్, సుదీప్, జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు. సైరా లో గురువు గోసాయి వెంకన్న పాత్ర పోషించిన అమితాబచ్చన్ సైరా నరసింహరెడ్డి లోని ఆవేశాన్ని గ్రహించి అతనికి యుద్ద విద్యలతోపాటు..యుద్ధం కత్తితోకాదు..బుర్రతో చేయాలంటూ సూచనలు ఇస్తాడు. ఈ సినిమాలో దేవాలయంలో నాట్యగత్తె పాత్ర పోషించిన లక్ష్మీ (తమన్నా) లుక్స్ పరంగా పేలవంగా కన్పిస్తుంది.
సైరా నరసింహరెడ్డి ప్రేరణ మేరకు ప్రజల్లో పోరాటపటిమను పెంచేందుకు తన నాట్యాన్ని ఉపయోగిస్తుంది. బ్రిటీషర్లు బట్టలు లేకుండా డ్యాన్స్ చేయమని లక్ష్మీని ఆదేశించినప్పుడు నిప్పుతో తనను తాను దహించుకోవటంతోపాటు...అక్కడ ఉన్న మందుగుండు సామగ్రి పేల్చుతూ బ్రిటీషర్ల క్యాంప్ మొత్తం పేలిపోవటానికి కారణమైన సీన్ మాత్రం సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. బుర్రా సాయిమాధవ్ మాటల పంచ్ లు కూడా ఈ సినిమాలో పెద్ద కన్పించలేదనే చెప్పాలి. సైరా నరసింహరెడ్డి భార్య పాత్ర పోషించిన నయనతార రోల్ కూడా పరిమితంగానే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో చారిత్రక సినిమాలు అంటే బాహుబలి రెండు భాగాల ద్వారా రాజమౌళి ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిపెట్టారు. బాహుబలితో పోల్చితే సైరా నరసింహరెడ్డి తేలిపోతుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా సైరా నరసింహరెడ్డిని చూస్తే మాత్రం ఇది చిరంజీవి చేసిన ఓ చారిత్రక సినిమాగానే చెప్పుకోవాలి.
రేటింగ్. 2.75/5