ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ నియామకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా జనవరిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగాల్లో తొలి ప్రాధాన్యత ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల్లో ఇక రాత పరీక్షలకే కీలకం కానున్నాయి. ఇందులో వచ్చిన మార్కుల ప్రకారమే నియామకాలు జరగనున్నాయి. ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలకాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌పై నిర్వహించిన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. అత్యంత పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల భాగస్వామ్యం ఉండేలా ఆలోచన చేయాలని అన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు చెప్పగా, ఇకపై ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు ప్రారంభించింది.