హుజూర్ నగర్ లో కెసీఆర్ బహిరంగ సభ రద్దు

Update: 2019-10-17 09:37 GMT

తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార టీఆర్ఎస్ ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని చూస్తుంటే..తమ సీటును నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ తరుణంలో ఆర్టీసి సమ్మె తెలంగాణ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఈ విషయంలో ఏ మాత్రం తొణకకుండా ఉన్నట్లు కన్పిస్తున్నా ప్రజల్లో మాత్రం సర్కారు తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో జరుగుతున్న ఉప ఎన్నిక కావటంతో హజూర్ నగర్ కు ఎక్కడలేని ప్రాధాన్యత ఏర్పడింది.

ఇదిలా ఉంటే గురువారం నాడు సీఎం కెసీఆర్ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణం గా సభను రద్దు చేశారు. విచిత్రం ఏమిటంటే ఈ సభకు కెసీఆర్ హాజరు అవుతారా? లేదా అన్న అంశంపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో వర్షం రావటంతో సభ రద్దు అయింది. సీఎం కెసీఆర్ హెలిక్యాప్టర్ లో వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. హూజూర్ నగర్ లో భారీ వర్షం పడడంతో పాటు, మార్గ మధ్యలో కూడా ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో పైలట్ల సూచన మేరకు అనుమతి రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

Similar News