కెసీఆర్ కు కేశవరావు సలహా

Update: 2019-10-14 09:50 GMT

రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె. కేశవరావు ధైర్యం చేసినట్లే కన్పిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూలేని రీతిలో ఆయన ఓ ప్రటకన విడుదల చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం తప్ప...మిగిలిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే కెసీఆరే కదా?. అసలు ఆర్టీసి కార్మికులతో చర్చలు లేవు...అందరూ సెల్ఫ్ డిస్మిస్..వెనక్కి వస్తామన్నా తీసుకునేది లేదు అంటూ ప్రకటించింది సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే. ఈ తరుణంలో కెసీఆర్ కు కేశవరావు సలహా ఇవ్వటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు ఆర్టీసి కార్మికులకే కేసీఆర్ చాలానే చేశారంటూనే కీలకమైన సూచనలు చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పడాన్ని తాను స్వాగతిస్తున్నానని.. ఇందుకు ఆయనను అభినందిసస్తున్నాని పేర్కొన్నారు. ఇక అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజీ క్యారేజీల విషయంలో కేసీఆర్‌ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని విఙ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని... ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం చూపజాలదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె.కేశవరావు అన్నారు. పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమించి చర్చలకు సిద్ధం కావాలని కోరారు. గతంలో ఆర్టీసి కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని పేర్కొన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని వ్యాఖ్యానించారు.కేశవరావు లేఖపై ఆర్టీసీ జెఏసీ కూడా స్పందించింది. ఆయన మధ్యవర్తిత్వం వహిస్తానంటే చర్చలకు తాము రెడీ అని ప్రకటించారు.

Similar News