‘కంటి వెలుగు’కు శ్రీకారం చుట్టిన జగన్

Update: 2019-10-10 07:04 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. 560 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండున్నర సంవత్సరాల్లో అమలు చేసేలా ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’ పథకం ప్రారంభించారు. అనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఈ పథకం ప్రారంభించారు. ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఏపీలోని 62 వేల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకాన్ని ప్రారంభించగా, అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ప్రారంభించారు.

మొదటి దశలో సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ పరీక్షలు జరుగుతాయి. ప్రపంచ దృష్టి దినం సందర్భంగా అక్టోబర్‌ 10 నుంచి 16 వరకు ఆరు పనిదినాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తర్వాత రెండో దశలో కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా గుర్తించిన వారిని నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు విజన్‌ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్స చేస్తారు. కళ్లద్దాలు, క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు, ఇతర సేవలు ఉచితంగా అందిస్తారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.

 

Similar News