జగన్ తో చిరు ఫ్యామిలీ భేటీ

Update: 2019-10-14 10:27 GMT

మెగా స్టార్ చిరంజీవి సోమవారం నాడు అమరావతిలో భార్య సురేఖతో కలసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. చిరు దంపతులకు జగన్, భారతిలు సాదరంగా ఆహ్వానం పలికారు. రామ్ చరణ్ కూడా ఈ భేటీలో ఉంటారని ప్రచారం జరిగినా...చిరంజీవి, సురేఖ మాత్రమే జగన్ తో సమావేశం అయ్యారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి వెళ్లారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీ ముఖ్యంగా సైరా నరసింహరెడ్డి సినిమాకు సంబంధించిన అంశంపైనే అని చెబుతున్నారు.

ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డిసినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కినసైరా నరసింహారెడ్డిసినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది. జగన్ కు సైరా సినిమా గురించి చెప్పటంతో సినిమాను వీక్షించాల్సిందిగా చిరంజీవి కోరినట్లు సమాచారం. వీరిద్దరి భేటీ దాదాపు గంట పాటు సాగింది.

Similar News