ఏపీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ ఏమిటి?. రివర్స్ టెండరింగ్ లో సింగిల్ బిడ్డర్ గా నిలిచి ప్రాజెక్టు దక్కించుకున్న మెఘా ఇంజనీరింగ్ సంస్థపై భారీ ఎత్తున ఐటి దాడులు జరగటంతో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరగుతుందో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఐటి శాఖ అధికారులకు ఏ మాత్రం సమాచారం లేకుండా ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి ఈ దాడులు నిర్వహించాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు ఏకంగా కేంద్రానికి చెందిన భద్రతా బలగాలను తెచ్చుకుని మరీ మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఐటి దాడులు చేశారంటే పరిస్థితి తీవ్రత ఎక్కువగానే ఉందని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారం హైకోర్టులో ఉంది. కోర్టు సర్కారుకు అనుకూలంగానే తీర్పు ఇచ్చినా ఈ పరిస్థితుల్లో మెఘా ఇంజనీరింగ్ వెంటనే రంగంలోకి దిగి పోలవరం పనులను చకచకా చేయగలుగుతుందా?.
ఐటి దాడుల్లో లభ్యమైన పత్రాలు..లావాదేవీల అంశంపై మార్కెట్లో పలు పుకార్లు ఉన్నా ఖచ్చితమైన సమాచారం అంటూ ఏదీ బహిర్గతం కాలేదు. అయితే వ్యవహారం ఐటి దాడులతోనే ఆగిపోతుందా? లేక ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) వరకూ వెళుతుందా..లేదా అన్న అంశం తేలాలంటే కొంత సమయం పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో మెఘా పోలవరం పనులను ఎంత స్పీడ్ గా ముందుకు తీసుకెళుతుందీ అన్న చర్చ కూడా ఏపీ అధికార వర్గాల్లో జరుగుతోంది. ఓ వైపు విపక్షాలు పోలవరం ప్రాజెక్టును ఆపివేశారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. సర్కారు మాత్రం నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని చెబుతూ వచ్చింది. అయితే పనులు ఎవరు మొదలుపెట్టినా కనీసం నెల నుంచి నెలన్నర వరకూ ప్రాజెక్టు సైట్ లో ఉన్న నీళ్ళు తోడేయటం..బురద తొలగించటం వంటి వాటికే సరిపోతుందని..అసలు పనులు ప్రారంభం కావాలంటే మాత్రం డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలోనే అని ఓ ఇంజనీరింగ్ నిపుణుడు వ్యాఖ్యానించారు. చూడాలి పోలవరం విషయంలో ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో.