ఫుల్ పేజీ యాడ్ లో మంత్రి ఫోటోకు చోటే దొరకలేదా?

Update: 2019-10-15 03:09 GMT

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అవమానం

‘ఏపీలో అంతా జగన్ మయమేనా?. రాష్ట్ర మంత్రులకు అసలు విలువే లేదా?. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత మంత్రులను అవమానించటం వెనక మతలబు ఏమిటి?. ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి ఏపీలో మంగళవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. దీనికి సంబంధించి ఏకంగా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఏపీలోనే కాదు..సాక్షితో పాటు మరికొన్ని ఆంగ్ల పత్రికల్లో హైదరాబాద్ లోనూ యాడ్స్ వేశారు. ఇది ఒకెత్తు అయితే ఫుల్ పేజీ యాడ్స్ లో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్టాంప్ సైజ్ పెట్టడానికి కూడా వ్యవసాయ శాఖ ఎందుకు సాహసం చేయలేదు. యాడ్ చివర్లో మంత్రి పేరు రాసి వదిలేశారు. వ్యవసాయ శాఖ పేరుతో విడుదల చేసిన ఫుల్ పేజీ ప్రకటనలో ఇయర్ ప్యానల్ లో కూడా జగన్ ఫోటోనే పెట్టారు కానీ..ఆ శాఖ మంత్రిని ప్రకటన విడుదల చేసిన శాఖ ఎలా విస్మరించింది?. ఇది జగన్ ఆదేశాల మేరకు జరిగిందా?. లేక వ్యవసాయ శాఖ అధికారులు అత్యుత్సాహమా?. అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన యాడ్స్ లో ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ మంత్రి ఫోటోలు వేయటం ఆనవాయితీ.

ఏ ప్రభుత్వంలో అయినా అలాగే చేస్తారు. చంద్రబాబు హయాంలో కూడా ప్రకటనల్లో సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలు వచ్చేవి. కానీ గత పాలనకు భిన్నంగా తన పాలన ఉంటుందని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు రైతు భరోసా యాడ్స్ లో అసలు వ్యవసాయ మంత్రి ఫోటోకి చోటు లేకుండా చేశారు. గతంలో ఇదే వైసీపీ నేతలు ‘చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తిని చంద్రబాబు అవమానించారు. అప్పటి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను అవమానించారు అంటూ విమర్శలు చేసిన ఉదంతాలు ఎన్నో. దీనికి సంబంధించి సాక్షిలో కూడా ఎన్నో కథనాలు వచ్చాయి. రైతు భరోసా విషయంలోనూ వాస్తవానికి జగన్ ఇచ్చిన హామీ ఒకటి. ఇప్పుడు అమలు చేస్తున్నది ఒకటి. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 12500 రూపాయలు ఇస్తామని చెప్పి..ఇప్పుడు కేంద్రంలో మోడీ సర్కారు పథకాన్ని కూడా ఇందులో కలిపేసి పథకానికి పీఎం కిసాన్ పేరును జోడించారు. ఇది వాస్తవంగా జగన్ తాను ఇచ్చిన హామీని ఉల్లంఘించటమే అవుతుంది. కేంద్రం నిధులు ఈ పథకానికి వాడుకుంటుండటంతో ప్రదాని మోడీ ఫోటోను మాత్రం యాడ్స్ లో పెట్టారు.

 

 

 

Similar News