సీనియర్ నేత, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ లు అధికార వైసీపీని వీడిన అంశంపై బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఎన్నికలకు ముందు తనకు వైసీపీలో చేరాలనే ఆహ్వానం వచ్చింది కానీ..ఇటీవల తనకు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదన్నారు. వైసీపీలో చేరడానికి ముందే తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టంగా ఆ పార్టీ నేతలకు చెప్పారని వెల్లడించారు. అందుకు వైసీపీ నేతలు అంగీకరించిన తరువాతే తన భర్త, కుమారుడు ఆ పార్టీలో చేరారని స్పష్టం చేశారు.
పురందేశ్వరి బిజెపికి రాజీనామా చేసి వైసీపీలోకి వస్తే రాజ్యసభ ఇస్తామని ఆ పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఒకే కుటుంబంలో భార్య ఓ పార్టీలో..భర్త మరో పార్టీలో ఉండటం కరెక్ట్ కాదని కూడా వైసీపీ నేతలు వీరికి సూచించినట్లు సమాచారం. దీంతో పురంధేశ్వరి బిజెపిలో కొనసాగాలని నిర్ణయించుకోవటంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ లు వైసీపీనీ వీడి బయటకు వచ్చారు. గత కొంత కాలంగా పురందేశ్వరి జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పురందేశ్వరి తాజా పరిణామాలపై మీడియాతో మాట్లాడారు.