రైతుల విషయంలో మాట తప్పి..మడమ తిప్పిన జగన్

Update: 2019-10-14 11:43 GMT

రైతు భరోసాలో గోల్ మాల్

రైతులకు సీఎం జగన్ మరో వరం. రైతులకు మరింత మేలు. ఇది కొన్ని ఛానళ్లలో సోమవారం నాడు ఊదరగొట్టిన వార్త. కానీ వాస్తవం ఏంటి?. జరుగుతుంది ఏంటి?. జగన్ చెప్పింది ఏంటి. చేస్తుంది ఏంటి? ‘రైతు భరోసా కింద రైతులకు ఏటా 12500 రూపాయలు ఇస్తానని జగన్ ప్రకటించింది 2017 జూలైలో జరిగిన ప్లీనరీలో.’ అప్పటికి అసలు మోడీ సర్కారు పీఎం కిసాన్ సమ్మాన్ పథకమే ప్రకటించలేదు. జగన్ ఈస్కీమ్ ప్రకటించిన కొన్ని సంవత్సరాల తర్వాత కేంద్రంలోని మోడీ సర్కారు పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రకటించింది. అది 2019 ఫిబ్రవరిలో. ఈ పథకం కింద మూడు విడతల్లో కలిపి రైతులకు ఆరు వేల సాయం అందించనున్నారు.’ జగన్ సర్కారు తాను ఇస్తానన్న రైతు భరోసాకు గండికొట్టింది. మోడీ పథకాన్ని కూడా ఇందులో కలిపేసింది.’ ఈ లెక్కన రైతులకు అన్యాయం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపునే స్వయంగా ఏటా 12500 రూపాయలు ఇస్తానని జగన్ ప్రకటించారు. ఇప్పుడు మాట తప్పి రైతులకు అందే నిధుల్లో కోత పెట్టారు. తాజాగా రైతు భరోసా పేరును కూడా వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనగా నామకరణం చేశారు. అంటే ఒక్క పథకానికి రెండు పేర్లా?. కేంద్రంలోని మోడీ సర్కారు రైతులకు ఇస్తున్న నిధులను కలిపేసుకున్నందునే ఈ మార్పు అని స్పష్టంగా అర్ధం అవుతోంది.

జగన్ రైతు భరోసా కింద ముందు ప్రకటించిన నిధుల్లో సగానికి సగం కోత కోసి ఇఫ్పుడు ఓ వెయ్యి రూపాయలు జత చేసి..రైతులకు మరో వరం అంటూ ప్రచారం చేయటం విచిత్రంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2014 ఎన్నికల ముందుకు అందరికి రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇఛ్చి చంద్రబాబు ఎలా మాట తప్పారో...ఇఫ్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు అయింది. రైతు భరోసాపై జగన్ చెప్పింది ఒకటి..చేస్తున్నది ఒకటి. మరి చంద్రబాబుకు, జగన్ కు రైతులను మోసం చేసే విషయంలో తేడా ఎక్కడ ఉన్నట్లు?.తాను అసలు చంద్రబాబులా కాదు..చెప్పానంటే చేసి తీరుతా?. మాట ఇస్తే అమలు చేస్తా అని చెప్పుకునే జగన్ రైతుల దగ్గరకు వచ్చేసరికి మాట మార్చటంలో మతలబు ఏమిటి?. జగన్ కు ఈ హామీ ఇఛ్చేముందు ఏపీ ఆర్ధిక పరిస్థితి తెలియదా?. ఎంతో ముందు ఇచ్చిన ఈ హామీని అడ్డగోలుగా మార్చటం వెనక కారణం ఏంటి?. రాజకీయంగా ఇది వైసీపీకి రాబోయే రోజుల్లో చిక్కులు పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

 

 

 

 

Similar News