తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కు సంబంధించి రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ ను కలవటానికి సిద్ధపడగా..చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు చర్యలను వీరు తీవ్రంగా ఖండించారు. మూడు నెలలుగా తన దగ్గరకు రానివ్వకుండా చంద్రబాబు నాయుడు కోడెలను మానసిక క్షోభకు గురిచేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు.
కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కనీసం పరామర్శకు వెళ్లని చంద్రబాబు ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హంతకుడే హత్య జరిగిందని యాగీ చేసినట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు గవర్నర్ దగ్గరకు వెళ్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఈ ప్రశ్నలు అడిగితే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారంటూ ఎమ్మెల్యేలు అంబటి, గోపిరెడ్డి 20 ప్రశ్నలను సంధిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
చంద్రబాబుకు అంబటి, గోపిరెడ్డి సంధించిన ప్రశ్నలు :
- గత మూడునెలలుగా మీరు కోడెలను దగ్గరకు రానిచ్చారా?
- కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారా?
- అసెంబ్లీ నుంచి కోడెల కోట్ల రూపాయల ఫర్నిచర్ తరలించడం మీకు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా?
- కోడెల ఫర్నిచర్ వ్యవహారంలో, ఆయన అరాచకాలకు గురై తట్టుకోలేక ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తే మీరు ఎందుకు నోరెత్తలేదు?
- గత ఐదేళ్లుగా కోడెల కొడుకు, కూతురు కే ట్యాక్స్ వసూలు చేశారా? లేదా?
- గత ఐదేళ్లుగా కోడెలకు చెందిన ఫార్మా డీల్స్ మీకు తెలిసే జరిగాయా? తెలియకుండా జరిగాయా?
- గత ఐదేళ్లుగా కోడెల అవినీతి సామ్రాజ్యానికి మీరు వెన్నుదన్నుగా ఉన్నారా? లేదా?
- ఇటు సత్తెనపల్లిలోనూ, అటు నర్సరావుపేటలోనూ భూ కబ్జాల మీద మీరు విచారణ ఎందుకు చేయించలేదు?
- కోడెల తాను చనిపోకముందు మీకు ఫోన్ చేసి.. అయ్యా.. ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, మీకు ఎప్పుడైనా చెప్పారా? చెప్తే మీరెందుకు స్పందించలేదు? ఎందుకు మాట్లాడలేదు?
- కోడెల తన మరణానికి ఈ ప్రభుత్వ వేధింపులు కారణమని వాంగ్మూలం ఎప్పుడైనా ఇచ్చారా?
- కోడెల చనిపోతూ తన మరణానికి కారణాలు ఇవి, అని ఎక్కడైనా పేర్కొన్నారా?
- చంద్రబాబుగారూ.. ఒక మనిషి తీవ్ర అవమానానికి గురైతే ఎన్టీఆర్ మాదిరిగా తల్లడిల్లి పోతాడా? లేదా? ఈ విషయం మీకు పాతికేళ్ల క్రితమే తెలుసు కదా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.