వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాతో మంచి హిట్ దక్కించుకుని జోష్ లో ఉన్న హీరో. ఇంత కాలం ఈ హీరో లవ్ స్టోరీల సినిమాలకే పరిమితం అయ్యాడు. కాని తొలిసారి వీర మాస్ లుక్ లో ‘వాల్మీకి’ (గద్దలకొండ గణేష్) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే వాల్మీకి టైటిల్ వివాదం నెలకొనటంతో చివరి నిమిషంలో చిత్ర యూనిట్ సినిమా పేరు మార్చింది. వాల్మీకి సినిమాతో మాస్ ఇమేజ్ కోసం ఈ హీరో ప్రయత్నించాడు. భారీ గడ్డం..ముఖంపై గాటు..పెద్ద పెద్ద మీసాలతో గద్దలకొండ గణేష్ పాత్రతో న్యూలుక్ లో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఇక సినిమా స్టోరీ గురించి ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఒకప్పుడు దొంగగా ఉన్న వాల్మీకి తర్వాత మహర్షిగా మారి రామాయణం రాసినట్లు..ఈ సినిమాలో విలన్ గా ఉన్న వరుణ్ తేజ్ హీరోగా సినిమాలో నటించటమే కథ. చిన్నప్పటి నుంచే రౌడీయిజం వైపు మళ్ళిన గణేష్ గద్దలకొండ అనే ఊరిలో హవా చెలాయిస్తూ ఉంటాడు. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలను గెలిపించటంతోపాటు...స్థానికంగా జరిగే అన్నింటిలో హవా గణేష్ దే.
మరి విలన్ గా ఉన్న గణేష్ చివరకు హీరోగా ఎలా మారాడు అన్నదే సినిమా. ఈ సినిమాలో డైరక్టర్ అవ్వాలనే తపించే పాత్రలో నటించిన అధర్వ క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుంది. అధర్వ తన తొలి సినిమాకు మంచి కథ కోసం స్నేహితుడి సాయంతో గద్దలకొండ చేరుకుంటాడు. అక్కడ గణేష్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలో పలు చిక్కులు ఎదుర్కొంటాడు. సినిమా అంతా ఇదే లైన్ పై నడిపించాడు దర్శకుడు హరీష్ శంకర్. హీరోయిన్ పూజా హెగ్డె అయితే సినిమా ఫస్టాఫ్ లో ఎక్కడా కన్పించదు. అధర్వకు జోడీగా నటించిన మృణాలిని రవి ఆకట్టుకుంటుంది. సెకండాఫ్ లోనూ పూజా క్యారెక్టర్ పరిమితంగా ఉంటుంది.
గణేష్ చిన్నప్పటి అభిమాన నటి అయిన శ్రీదేవి పేరునే పూజాకు పెట్టి...చిత్రలహరిలో శ్రీదేవి పాట వస్తే తప్ప..తమ లవ్ సక్సెస్ కాదని చెప్పి..వెల్లువొచ్చే గోదారమ్మ పాట రీమిక్స్ కు కథను దర్శకుడు బాగానే కనెక్ట్ చేశాడనే చెప్పాలి. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు ఏమైనా ఉన్నాయంటే అవి సత్య అక్కల, బ్రహ్మజీలు. వీరి పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తాయి. వాల్మీకి సినిమాలో సినీ రంగం ప్రాముఖ్యత గురించి ఎక్కువ చెప్పే ప్రయత్నం చేసి..అసలు సినిమా కథ ఏంటో అన్న కన్ఫ్యూజన్ ప్రేక్షకుల్లో కలిగేలా చేస్తాడు దర్శకుడు. వాల్మీకి సినిమాలో పలు సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పాటలు.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ చూస్తే వాల్మీకి (గద్దలకొండ గణేష్) మాస్ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకునే సినిమా.
రేటింగ్. 2.5/5