యురేనియం..కొత్త మోటార్ చట్టంపై కెసీఆర్ కీలక ప్రకటనలు

Update: 2019-09-15 16:36 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అత్యంత కీలకమైన, వివాదస్పద అంశాలపై స్పష్టమైన ప్రకటనలు చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రశ్నేలేదని తేల్చిచెప్పారు. తెలంగాణ సర్కారు యురేనియం తవ్వకాలకు ఇప్పటివరకూ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని..భవిష్యత్ లోనూ ఇవ్వబోదని అన్నారు. గతంలో అందరూ వారిస్తున్నా కాంగ్రెస్ పార్టీనే యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు.

ఏపీలో యురేనియం తవ్వకాల వల్ల ఆ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..నల్లమలలో వీటికి అనుమతిస్తే కృష్ణా జలాలు కలుషితం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో అత్యంత వివాదస్పదంగా మారిన నూతన మోటార్ వాహనాల చట్టాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయబోవటం లేదని తెలిపారు. దీంతో వాహనదారులకు ఎంతో ఊరటనిచ్చినట్లు అయింది. కొత్త చట్టం అమలు చేయటం లేదంటే ప్రస్తుతం తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న జరిమానాలే రాబోయే రోజుల్లో కూడా వర్తించనున్నాయి.

 

 

 

Similar News