తెలంగాణ కాంగ్రెస్ లో పవన్ కళ్యాణ్ కలకలం

Update: 2019-09-17 15:26 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. పార్టీ అగ్రనేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే సంపత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు యురేనియం అంశంపై అఖిలపక్ష సమావేశం పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఎవరు?. ఈ అంశాన్ని తొలుత లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ. పవన్ అఖిలపక్షం అనగానే సీనియర్ నేతలు అందరూ అక్కడికి పోయి కూర్చుంటారా?. కాంగ్రెస్ పిలిచిన ఏ అఖిలపక్షానికి అయినా పవన్ కళ్యాణ్ వచ్చాడా?. ఇదెక్కడి పద్దతి అంటూ సంపత్ కాంగ్రెస్ సీనియర్ నేతల తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేతలైన వి. హనుమంతరావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

మంగళవారం నాడు హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశంలో సంపత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. సంపత్ వాదనతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా కూడా ఏకీభవించటంతో షాక్ తినటం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వంతు అయింది. అంతే కాదు భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇఛ్చినట్లు సమాచారం. పలు అంశాలపై కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేకపోవటం ఒకెత్తు అయితే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేసుకుంటూ పోవటం వల్ల సమస్యలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతల సమావేశంలో శ్రవణ్, నిరంజన్ ల మధ్య మాటల యుద్ధం సాగింది.

 

 

Similar News