అమిత్ షా కోసం ఓట్లు అడుగుతున్న మోడీ

Update: 2024-05-12 12:36 GMT

Full Viewప్రధాని మోడీ పై...బీజేపీ పై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎంత కోపం ఉంటుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. గత కొంతకాలంగా టార్గెట్ కేజ్రీవాల్ గా పనిచేసిన బీజేపీ, మోడీ సర్కారు ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆయన్ను విజయవంతంగా జైలు కు పంపింది. ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వస్తూ వస్తూనే ఆయన అటు బీజేపీ ని..ఇటు మోడీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు అని చెప్పొచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ ఝలక్ పై బీజేపీ నేతలు స్పందించిన తీరు చూస్తూనే ఈ విషయం అర్ధం అవుతుంది. ప్రధాని మోడీ ఇప్పుడు ఓట్లు అడుగుతున్నది తన కోసం కాదు..అమిత్ షా కోసమే ఓట్లు అడుగుతున్నారు అంటూ బాంబ్ పేల్చారు. దీనికి ఆయన చెప్పిన కారణం ఏమిటి అంటే వచ్చే సెప్టెంబర్ నాటికీ ప్రధాని నరేంద్ర మోడీ వయస్సు 75 సంవత్సరాలు అవుతుంది అని..బీజేపీ లో ఎవరైనా 75 సంవత్సరాల తర్వాత యాక్టీవ్ రాజకీయాల్లో ఉండకూడదు అని నిబంధనను తెచ్చింది కూడా మోడీ నే అని కేజ్రీవాల్ తెలిపారు. ఇది చెప్పే అద్వానీ , మురళి మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ లాంటి వాళ్ళను పక్కన పెట్టారని కేజ్రీవాల్ ఆరోపించారు.

                         ఈ లెక్క ప్రకారం మోడీ రిటైర్ అవుతారా?. ఆయన ప్లేస్ లో ఎవరిని ఎన్నుకుంటారు అంటూ కొత్త చర్చకు కేజ్రీవాల్ తెరలేపారు అనే చెప్పొచ్చు. ఎన్నికల తర్వాత రెండు నెలల్లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కూడా పక్కనపెడతారు అని మరో బాంబ్ పేల్చారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అటు అమిత్ షా తో పాటు ఇతర కీలక నేతలు అందరూ స్పందించారు. బీజేపీ రాజ్యాంగం లో అలాంటి నిబంధన ఏమి లేదు అని..మోడీ మళ్ళీ తన పూర్తి టర్మ్ ను పూర్తి చేసుకుంటారు అని అమిత్ షా స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలు నిరాధారం అన్నారు. నిరాశలో ఉన్న ప్రతిపక్షం ఇప్పుడు మోడీ వయసు గురించి మాట్లాడుతుంది అని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. మోడీ దేశంలోని 140 కోట్ల మంది ఆమోదించిన లీడర్ అంటూ పేర్కొన్నారు. మొత్తానికి కేజ్రీవాల్ మాత్రం తన వ్యాఖ్యల ద్వారా చర్చను మరో వైపు మళ్లించటంలో విజయవంతం అయ్యారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో వైపు తన దగ్గరకు వచ్చే సరికి మోడీ 75 సంవత్సరాల నిబంధన పక్కన పెట్టి..తాను పక్కన పెట్టాలనుకునే వాళ్లకు మాత్రమే ఈ నిబంధనను తెరపైకి తెచ్చారు అనే విమర్శలు ఎదుర్కోకతప్పదు.

Tags:    

Similar News