ఏపీలో విద్యుత్ కోతలపై పవన్ ఫైర్

Update: 2019-09-30 13:28 GMT

ఏపీలో విద్యుత్ కోతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదటి పని శుభం తో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు. పెట్టుబడుల మీద ఒప్పందాలు. కానీ వైసీపీ సర్కారు కూల్చివేతలతో పనులు ప్రారంభించింది. ఇలాంటి వారికి విద్యుత్ సమస్యపై ఫోకస్ పెట్టే పరిస్థితి ఎక్కడ ఉంటుంది అని వ్యంగాస్త్రాలు సంధించారు. విద్యుత్ అంశంపై పవన్ కళ్యాణ్ పలు ట్వీట్లు చేశారు. ‘ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.

కానీ సర్కారు మాత్రం భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశా వర్కర్ల ని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం వంటి పనులు మాత్రం చేసింది. ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55.315 మిలియన్ యూనిట్లు మాత్రమే. 2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినపుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఇంథన శాఖ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారు’ అని విమర్శించారు.

 

Similar News