ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ

Update: 2019-09-30 08:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్లు వస్తాయని పేర్కొన్నారు. నిరుద్యోగలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒకేసారి లక్షా నలభైవేల మందికి ఉద్యోగాలు కల్పించటం ఓ కొత్త రికార్డు అని జగన్ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. అవినీతి లేని పాలన కోసం గ్రామాల్లో ఎదురుచూస్తున్నారని..లంచాలు లేని పాదర్శకత పాలనకు కొత్తగా ఉద్యోగాలు దక్కించుకున్న వారంతా సహకరించాలని కోరారు. ప్రజలకు సేవ చేయటానికే ఈ ఉద్యోగాలు అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అతి తక్కువ సమయంలో..అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఈ డిసెంబర్ నాటికి ప్రతి గ్రామ వాలంటీర్ కు స్మార్ట్ ఫోన్ ఇస్తామని, జనవరి 1 నుంచి గ్రామాల్లో 500 సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటమే తమ లక్ష్యం అని తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వారు కూడా వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేసేలా సేవలు అందించాల్సి ఉందని జగన్ వ్యాఖ్యానించారు.

‘ప్రతీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలి. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడొద్దు. మీ పని తీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. దేశంలో ఇటువంటి ప్రయోగం ఎవరూ చేసి ఉండరు... మీరంతా కలిసి దీనిని విజయవంతంగా పూర్తి చేస్తారనే నమ్మకం నాకుంది’ అని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలు, తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో.. అత్యంత పారదర్శకంగా ఏకంగా ఇరవై లక్షల మందికి పైగా ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడం, ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం, లక్షా నలభై వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం.. ఇది నిజంగా ఓ రికార్డు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం. ప్రతీ రెండు వేల జనాభాకు సచివాలయం పెట్టడం.. తద్వారా పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఉజ్జాయింపుగా ప్రతీ గ్రామానికి పది నుంచి పన్నెండు ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్న’ అని తెలిపారు.

 

 

Similar News