జగన్ ది టెర్రరిస్టుల కంటే దారుణమైన సర్కారు

Update: 2019-09-17 04:39 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కోడెల మరణానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్నది టెర్రరిస్టుల కంటే దారుణమైన ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కారు కంటే టెర్రరిస్టులే నయం అన్న చందంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. కోడెల బలవన్మరణంపై ఆయన మంగళవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. కోడెలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధించి చంపారని ఆరోపించారు. పల్నాడు టైగర్‌గా కోడెలకు గుర్తింపు ఉందన్నారు. కోడెలలాంటి వ్యక్తే అవమానాలను భరించలేకపోయారన్నారు. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారని చంద్రబాబు మండిపడ్డారు. దేశ చరిత్రలో ఓ సీనియర్‌ నేత ఆత్మహత్య చేసుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. కోడెలలాంటి వ్యక్తికి ఇలాంటి ముగింపు రావడం బాధాకరమన్నారు. కేసులు, వేధింపులతో కోడెల కుటుంబాన్ని చెల్లాచెదురుచేశారని.. కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. తన ఇంట్లోని ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని...అసెంబ్లీ కార్యదర్శికి కోడెల నాలుగు లేఖలు రాశారన్నారు. కానీ అసెంబ్లీ కార్యదర్శి కనీసం స్పందించలేదన్నారు.

రూ.43వేల కోట్లు దోచుకుని, 11 చార్జిషీట్లలో జగన్‌ ముద్దాయన్నారు. కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ విషయంలో...కోడెల శివప్రసాదరావుపై కేసులు పెట్టడం దారుణమన్నారు. కోడెలపై 19 కేసులు పెట్టారని, పాత కేసులు తిరగదోడారన్నారు. కోడెలకు వ్యతిరేకంగా కేసులు వేయాలని... ట్విట్టర్‌లో, పేపర్‌లో విజయసాయిరెడ్డి ప్రకటనలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. సాక్షి పేపర్‌లో పదేపదే కోడెలను విమర్శిస్తూ కథనాలను రాయించారన్నారు. అనేక చీటింగ్‌ కేసుల్లో నిందితుడైన రంజీ క్రికెటర్‌ నాగరాజుతో... ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు వేయించారన్నారు. డీజీపీని సంప్రదించినా తన వల్ల కాదని తిప్పి పంపారని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై కూడా చంద్రబాబు ఆరోపణలు చేశారు. 43 వేల కోట్లు దోచుకొని 11 చార్జిషీట్ లలో జగన్ ముద్దాయి అయిన ముఖ్యమంత్రి ఇప్పుడు అందరికీ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

 

 

Similar News