ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తన అనాలోచిత నిర్ణయాలతో జగన్ ఏపీని రివర్స్ చేస్తున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ అంటూ రాష్ట్రాన్ని రివర్స్ చేశారని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని చంపేసే పరిస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు. ‘ప్రపంచం మెచ్చే రాజధాని కావాలని కలలు కంటే కుట్రతో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ తో ముందుకు పోయే ప్రాజెక్టును దెబ్బతీశారు.హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో ఆంధ్రప్రదేశ్ కూ ఓ మంచి రాజధాని ఉండాలి అనుకోవడం నేను చేసిన తప్పా...? జీవనాడి పోలవరం ప్రాజెక్టును నిలుపుదల చేశారు. 100 రోజుల్లో ఏ ఊళ్ళో అయినా ఒక పని అయిందా? ఊరికో ప్యాలస్ కట్టుకున్న వ్యక్తి గృహనిర్మాణలో అవినీతి అంటున్నారు.నరేగా నిధులు ఖర్చు చేయకుండా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.పాత బిల్లుల్ని విడుదల చేయకుండా వాటిని ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు విధ్వంసం, వేధింపులు, రాక్షసత్వమే వైకాపా 100రోజుల పాలన అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
సన్న బియ్యాన్ని నాణ్యమైన బియ్యం అంటూ మాట మార్చి మడమ తిప్పారు. తెలుగుదేశం నాయకుల్ని వేధించటంలో జగన్ చూపే శ్రద్ద, బాబాయి కేసు నిందితుడ్ని పట్టుకోవడం లో చూపాలి. పార్టీకి యువరక్తం కావాలి-యువతరం రావాలి. మరో 30ఏళ్ల వరకు నాయకుల్ని తయారు చేసే శక్తి తెలుగుదేశానికిఉంది.పాతతరం అనుభవం, కొత్తతరం ఉత్సాహం రెండూ తెలుగుదేశానికి అవసరం.ప్రతీ సీనియర్ నేత ఓ కొత్త యువ నాయకుడిని తయారు చేయాలి.నూతన అధ్యయనానికి తూర్పుగోదావరి నుంచి తెలుగుదేశం శ్రీకారం చుడుతోంది.ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో అంతా జగన్ ను నిలదీయాలి.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు గురువారం నాడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.