గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి పేపర్ లీక్ అయిందన్న వార్తలపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఆయన ఈ అంశంపై సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు ‘గత 4 నెలల మీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు, ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు, మీ అనుభవ రాహిత్యం, చేతకానితనం, ఆశ్రిత పక్షపాతంతో పాటుగా మీ మూర్ఖత్వం-కక్ష సాధింపు వైఖరే మూలకారణం. అందుకు తాజాగా ఇంకో ఉదాహరణ ‘‘గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక ప్రవేశ పరీక్షా నిర్వహణ-ఫలితాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలే..’’పంచాయితీరాజ్ శాఖ, విద్యాశాఖలకే కాదు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపిపిఎస్ సి)ల ప్రతిష్టకే మాయని మచ్చగా ఈ ప్రవేశ పరీక్ష చెడ్డపేరు తెచ్చింది. రాష్ట్ర ఇమేజిని దెబ్బతీయడమే కాదు, దాదాపు 19లక్షల మంది అభ్యర్ధులను, వారి కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ చరిత్రలో ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరిగాయి, లక్షలాది ఉద్యోగాల ఎంపిక జరిగిందికాని, మున్నెన్నడూ లేనంత అధ్వానంగా, అవినీతిమయంగా, అక్రమాలు-అవకతవకల భూయిష్టంగా ‘‘గ్రామ సచివాలయ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలను’’ నిర్వహించడం బాధాకరం.
ప్రవేశ పరీక్ష నోటిపికేషన్ జులై 26న వస్తే, సెప్టెంబర్ 1నుంచి 8వ తేది దాకా పరీక్షల ప్రక్రియ ప్రారంభించారు. 19,50,582మంది అభ్యర్ధులు 14కేటగిరీలలో పరీక్షలకు హాజరయ్యారని, మొత్తం ఉద్యోగాలు 1,26,728కిగాను 1,98,164మంది అర్హత సాధించారని, 56రోజుల వ్యవధిలోనే ఈ మొత్తాన్ని పూర్తిచేశామని ఆడంబరంగా ప్రకటించారే తప్ప వాటిలో ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎంత అధ్వానంగా పరీక్షల నిర్వహణ ఉందో గాలికి వదిలేశారు. దాదాపు 20లక్షల మంది అభ్యర్ధుల ఆశలను పూర్తిగా వమ్ము చేసి గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రక్రియకే తీరని కళంకం తెచ్చారు.’ అని ఆరోపించారు.