కూలుస్తారా..కూల్చమంటారా?..చంద్రబాబు ఇంటికి మళ్ళీ నోటీసులు

Update: 2019-09-21 05:31 GMT

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న కరకట్ట నివాసానికి ఏపీ సీఆర్ డీఏ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో కూల్చేస్తారా? లేదా మమ్మల్నే కూల్చేయమంటారా అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్నది ఖచ్చితంగా అక్రమ నిర్మాణమే అని మరోసారి తేల్చారు. గతంలో ఈ ఇంటి యాజమాని అయిన లింగమనేని రమేష్ ఇచ్చిన సమాధానం ఏ మాత్రం సంతృప్తికరంగా లేకపోవటంతో మరోసారి ఆయన పేరుతోనే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట భవనానికి నోటీసులు అంటించారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజావేదిక అక్రమ కట్టడం అని దాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంపై ఎప్పటి నుంచో వివాదం ఉన్న విషయం తెలిసిందే.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కరకట్ట పరిధిలో ఉన్నవి అన్నీ అక్రమ నివాసాలే అంటూ వాటిని కూల్చివేస్తామని కూడా ప్రకటించారు. కానీ చంద్రబాబు ఎప్పుడైతే కరకట్టలోని లింగమనేని గెస్ట్ హౌస్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నారో అప్పటి నుంచి దీన్ని టీడీపీ సర్కారు వదిలేసింది. కానీ అప్పటి నుంచి దీని చుట్టూ విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ విమర్శలు మరింత పెరిగాయి. తాజా పరిణామాలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. తాజాగా వచ్చిన కృష్ణా వరదల సమయంలో కూడా రాజకీయం అంతా చంద్రబాబు చుట్టుచుట్టూనే నడిచింది.

 

Similar News