పవన్ కళ్యాణ్ పై బొత్స ఫైర్

Update: 2019-09-01 12:22 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల అమరావతి పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ‘చంద్రబాబు హయాంలో పవన్ అమరావతిపై ఏమి మాట్లాడారు?. ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు అని ప్రశ్నించారు. ఒక దానితో ఒకదానికి పొంతన లేకుండా మాట్లాడటం ఆయనకు చెల్లింది అంటూ ఎద్దేవా చేశారు. పవన్ వైఖరి చూస్తుంటే చంద్రబాబు అవినీతికి మద్దతు ఇస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. అమరావతిలో పరిస్థితి ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు అన్న చందంగా ఉందని అన్నారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు, లోకేష్‌ ప్రధాన నిందితులని ఆరోపించారు. ఆదివారం అమరావతిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక సచివాలయం పేరుతో చదరపు అడుగును రూ.10 వేలు చేశారు. ఈ కుంభకోణాలలో చంద్రబాబు, లోకేష్ ప్రధాన నిందితులు కాబట్టి ఎల్లోమీడియాతో విమర్శలు చేయిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రశ్నించని పవన్‌ ఇప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అమరావతి సామాన్యులుకా సంపన్నులకా అన్నది పవన్ కళ్యాణ్ కాదా? కులాల రొచ్చు లేని రాజధాని కావాలి అనలేదా?

భూదోపిడీ చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రాజధాని నిర్మాణం ఆపేస్తా అని అన్నారా లేదా? రాజధాని అంశంలో రైతులకు అన్యాయం చేస్తే మాజీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పలేదా? రాజధాని పేరుతో నూజివీడు వాసులను టీడీపీ మోసం చేసిందని ఆయన గతంలో చెప్పలేదా’ అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. ‘రెండు మెట్లు దిగి జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో పార్టీ లో చేరాను. కాల మహిమతో కాదు, ప్రజలు నమ్మకంతో 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. మీలాంటి నాయకులు ఉన్నంత కాలం జగన్‌మోహన్ రెడ్డి సీఎంగానే ఉంటారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు, మీరు ఉంటున్న ఇంటికి జాగా ఇచ్చిన వ్యక్తి ఒక్కరు కాదా? రాజధాని ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో చెందినది కాదు. ప్రభుత్వధనం దుర్వినియోగం కాకుండా చూడటం మా బాధ్యత. వైఎస్ ఆశయాలను నిరవేర్చడం మా పార్టీ లక్ష్యం. పోలవరాన్ని టీడీపీ ఏటిఎంలా వాడుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని మోదీనే చెప్పారు. రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్తుంటే టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు అని విమర్శించారు.

 

Similar News