పీపీఏల సమీక్ష..రివర్స్ టెండరింగ్ వంటి అంశాలతో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా సర్కారుకు 782 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. బుధవారం నాడు అమరావతిలో జరిగిన ఎస్ ఎల్ బిసీ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ.782 కోట్లు ప్రజలధనాన్ని ఆదా చేశాం. దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదు. ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్ విధానాలు లేవు. రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నాం. పారదర్శక విధానాల్లో జ్యుడిషియల్ ప్రివ్యూ అత్యుత్తమం. ఏ రాష్ట్రం కూడా రివర్స్ టెండరింగ్ అమలు చేయడంలేదు.
పీపీఏల విషయంలో అదే విధంగా విప్లవాత్మక విధానాలు చేపట్టాం. అధికారంలోకి రాగానే విద్యుత్ అధికారులతో మేం రివ్యూ పెడితే డిస్కంలపై రూ.20వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. 13 నెలలుగా చెల్లింపులు లేవని చెప్పారు. అధిక ధరకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టవు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువుగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేస్తున్నారు. పరిశ్రమలకిచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడాలేదు. విద్యుత్‌రంగంలో పరిస్థితులను సరిద్దిడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యుత్ రంగం పునరుద్దరణకు మీ అందరి సహకారం కావాలి’ అంటూ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లను సీఎం వైఎస్ జగన్ కోరారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.