‘ప్రజాస్వామ్య అనివార్యత. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నచ్చని పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటి వంటి సంస్థల ఉపయోగించి దాడులు చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలుస్తున్నాం.’ ఇవీ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది కాలం క్రితం ఢిల్లీలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పక్క నుంచుని చెప్పిన మాటలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన, కేంద్ర మాజీ హోం, ఆర్ధిక శాఖల మంత్రి పి. చిదంబరం అరెస్ట్ అయితే చంద్రబాబునాయుడు కనీసం నోరెత్తటం లేదు. ఓ ఖండన లేదు..అలాగని సమర్ధన లేదు. ప్రజాస్వామ్యం ఎప్పుడు ప్రమాదంలో పడినా రెడీమని పరుగెత్తుకొచ్చే చంద్రబాబు ఎందుకు ఈసారి మౌనంగా ఉన్నారు. చంద్రబాబుతో కలసి ఉండే మమతా బెనర్జీ, స్టాలిన్ తోపాటు సీపీఎం నేత ఏచూరి లాంటి వారు కూడా కేసు మెరిట్స్ లోకి పోకుండా చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసిన తీరును మాత్రం తప్పుపట్టారు.
కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. దీన్ని ‘వ్యూహాత్మక మౌనం’ అంటారా? లేక అవసరార్ధ మౌనం అనే పేరు పెట్టుకుంటారా? ఓ వైపు ఏపీలో సీఎం జగన్ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అండ్ కో స్కామ్ లు తవ్వేపనిలో పడ్డారు. కేంద్రం తోకజాడించిన నేతలపై ఏ మాత్రం మెహమాటం లేకుండా జూలువిదుల్చుతోంది. అసలే రాజకీయంగా కష్టాల్లో ఉన్న ఈ క్లిష్టసమయంలో కోరికోరి కొత్త కష్టాలు తెచ్చిపెట్టుకోవటం ఎందుకనే ఉద్దేశంతోనే చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయించారని చెబుతున్నారు. తెలంగాణలో బిజెపికి టీడీపీని అప్పగించంతోపాటు ఏపీలో బిజెపి పురోగతికి సహకరిస్తున్న చంద్రబాబు విషయంలో ప్రస్తుతం బిజెపి సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నట్లు కన్పిస్తోంది. ఇది ఎంత కాలం అన్నది వేచిచూడాల్సిందే.