డ్రోన్ రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోండి

Update: 2019-08-17 13:43 GMT

కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లుపడుతుంటే – వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరుగుతూ రాజకీయాలు చేయడం శోచనీయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వరద ఉధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వం విధి. కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటమా మంత్రుల బాధ్యత? మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్ళి రాజకీయాలు చేస్తూ బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరవాత చేసుకోండి. ఇది విపత్కాలం.

వరద బాధల్లో ఉన్న పేదలను కాపాడండి. కరకట్ట మీద ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి ఆశ్రమం, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా రెండు రోజులపాటు బస చేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గృహం, అదే వరుసలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంతో పాటు ప్రముఖుల ఇళ్ళు, శ్రీ శారద పీఠం కార్యక్రమం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళిన ఆశ్రమం ఉన్నాయి. వరద ఉధృతి పెరిగితే అన్నీ మునుగుతాయి. ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావల్సిన అన్ని రకాల సహాయాలు చేయండి అని పవన్ కళ్యాణ్ సూచించారు.

 

Similar News