‘సాహో’ మూవీ రివ్యూ

Update: 2019-08-30 07:09 GMT

సాహో సినిమా. ఎంత హైప్..ఎంత హైప్. సామాన్య సినీ ప్రేక్షకుడు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరిలోనూ ఎన్నో అంచనాలు. ఎన్నో ఆశలు. ప్రభాస్ బాహుబలిని మించి అలరిస్తాడా?. కనీసం ఆ బాహుబలి రేంజ్ లో అయినా ఉంటుందా?. ఈ టెన్షన్ శుక్రవారం ఉదయం వరకూ అందరిలోనూ ఉంది. సినిమా విడుదలైంది. ఫలితం తేలింది. తీయటానికి భారీ బడ్జెట్ తో తీసినా..ప్రేక్షకులను మాత్రం ప్రభాస్ అంతే భారీ స్థాయిలో నిరాశపర్చాడనే చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఎక్కడా ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే సీన్లు కానీ...సన్నివేశాలు కానీ లేవనే చెప్పొచ్చు. తీయటానికి చాలా రిచ్ గా...భారీ ఖర్చుతోనే తీశారు. కానీ అదే రొటీన్ గ్యాంగ్ స్టర్ ఫార్ములాలు...దొపిడీలు..పోలీసుల ఛేజింగ్..అదే శాఖలో గ్యాంగ్ స్టర్లకు అనుకూలంగా పనిచేసే కోవర్టులు. వెరసి ఇదే సాహో సినిమా. పోనీ ఏమైనా సినిమాలో రొమాన్స్ అదిరిపోయేలా ఉందా? అంటే అది కూడా ఏ మాత్రం ఫీల్ లేని లవ్ ట్రాక్. శ్రద్ధాకపూర్ యాక్షన్ బాగానే ఉన్నా..ప్రభాస్, శ్రద్ధాకపూర్ కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి.

అలాగే యాక్షన్ సినిమాలో కామెడీ ఆశించటం అత్యాశే అవుతుంది. పాటల్లో ఒక్కటి కూడా ఇది గుర్తుంటుంది అనే పాట ఒక్కటీ లేదు. సినిమా మొత్తంలో ప్రభాస్ ఫేస్ లో ఫ్రెష్ నెస్ కన్పించకపోగా..ఏదో టెన్షన్ లో ఉన్నట్లు ప్రభాస్ సినిమా అంతా కన్పించాడు. పూర్తిగా విదేశాల్లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు మాత్రం సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. ఈ యాక్షన్ సీన్లు మాత్రం హాలివుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో తెరకెక్కించారు. సినిమా మొత్తం మీద ఒకట్రెండు ట్విస్ట్ లు ఓ మేరకు ప్రేక్షకులను ఆలరిస్తాయని చెప్పొచ్చు. దర్శకుడు సుజీత్ తన రెండవ సినిమా ద్వారానే ప్రభాస్ వంటి హీరోతో చేయటానికి రెడీ అయిపోయి సరైన కథను సిద్ధం చేసుకోలేకపోయాడనే విషయం సాహో సినిమా తేల్చింది. ఓవరాల్ గా చూస్తే భారీ బడ్జెట్ తో తీసి ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులను భారీగా నిరాశపర్చిన సినిమాగా ‘సాహో’ను చెప్పుకోవచ్చు.

రేటింగ్.2.25/5

Similar News