‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

Update: 2019-08-02 09:44 GMT

రూటు మార్చాడు. హిట్ కొట్టాడు. ఎట్టకేలకు బెల్లంకొండ శ్రీనివాస్ ట్రాక్ లోకి వచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం చెమటోడ్చినా దక్కని ఫలితం ఓ రీమేక్ సినిమాతో దక్కింది ఈ హీరోకి. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా రాక్షసన్ ను తెలుగులో ‘రాక్షసుడు’గా తెరకెక్కించారు. తమిళ వెర్షన్ చూడని ప్రేక్షకులకు ఈ సినిమా వీక్షణ ఉత్కంఠ రేపుతుంది. ముఖ్యంగా సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడే వారికి ఇది ఓమంచి సినిమా అని చెప్పొచ్చు. కథ, కథనం, సంగీతం, థ్రిల్లింగ్ అంశాలు సినిమాను చాలా ఆసక్తిగా ముందుకు తీసుకెళతాయి. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే దర్శకుడు కావాలనుకున్న అరుణ్ (బెల్లంకొండ శ్రీనివాస్) తన ప్రయత్నాలు విఫలమై..చివరకు పోలీసు ఉద్యోగంలో చేరతాడు. పోలీసుగా బాధ్యతలు చేపట్టాక అసలు టాస్క్ మొదలవుతుంది. స్కూల్‌ ఏజ్‌ అమ్మాయిలనే టార్గెట్‌ చేస్తూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. అయితే దర్శకుడిగా తాను అనుకున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ కోసం ప్రపంచంలో నలుమూలలా జరిగే సైకో హత్యలను అంతకు ముందే పరిశీలించి ఉంటాడు.

అరుణ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా జాయిన్‌ తరువాత మళ్లీ ఓ హత్య జరగుతుంది. ఈ హత్యలను చేధించటానికి తాను చేసిన పరిశోధనలను ఉపయోగిస్తాడు. అయితే అరుణ్ పరిశోధనను అంగీకరించని ఉన్నతాధికారులు ఆయన్ను విధుల నుంచి తప్పిస్తారు. అయినా సరే అరుణ్ తన పని పూర్తి చేస్తాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌.. యాక్షన్‌ సీన్స్‌ తోపాటు, ఎమోషనల్‌ సీన్స్‌ లోనూ మంచి నటన చూపించాడు. టీచర్‌గా కృష్ణవేణి పాత్రలో అనుపమా పరమేశ్వరన్ లుక్స్‌ తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాజీవ్‌ కనకాల మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్స్‌ లో తన అనుభవాన్ని చూపించాడు.

తమిళ వెర్షన్ సినిమానే పెద్దగా ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా తెరకెక్కించారు. అయినా సరే థ్రిల్లింగ్‌కు గురి చేసే ఎన్నో అంశాలు ఉండటం.. సీటు చివరన కూర్చోబెట్టే మూమెంట్స్‌ ఉండటం సినిమాకు కలిసొచ్చే అంశాలు. ఫస్ట్‌ టైమ్‌ ఈ చిత్రాన్ని చూస్తున్న వారు మాత్రమే అలాంటి థ్రిల్లింగ్‌కు గురవుతారు. గిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో ప్రతీ సన్నివేశాన్ని ఎలివేట్‌ చేశాడు. అయితే ఈ సినిమాలో సైకో ఎవరో కనిపెట్టే తీరు ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. సస్పెన్స్ విషయంలో అంచనాలకు అందని రీతిలో కథ ముందుకు సాగుతుంది. ఏది ఏమైనా బెల్లంకొండ శ్రీనివాస్ కు చాలా కాలం తర్వాత ఓ హిట్ వచ్చిందని చెప్పుకోవాల్సిందే.

రేటింగ్. 3/5

 

 

Similar News