ఏపీలో ఇప్పుడు ఒకే మాట పదే పదే విన్పిస్తుంది. అదే ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’. బహుశా దేశంలో ఎక్కడా కూడా ఓ రాజకీయ పార్టీపై ఇంతగా ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ ఆరోపణలు వచ్చిన దాఖలాలు లేవు. వాస్తవానికి ఇది స్టాక్ మార్కెట్ కు సంబంధించిన లావాదేవీల్లో జరిగే వ్యవహారం. ప్రభుత్వంలో ఉండే పెద్దలు అంటే ముఖ్యమంత్రి..మంత్రులకు కొత్తగా రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు వస్తుంది. ఎక్కడ ఏమి కట్టబోతున్నారు అన్న సమాచారం ముందస్తుగా తెలుస్తుంది. ఆ సమాచారమే వారికి పెట్టుబడి. కొత్తగా ప్రాజెక్టులు వచ్చే ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి..ఆ వార్తలు వెలుగులోకి వచ్చాక వాటిని లాభాలతో అమ్ముకుని బయటకు వెళతారు. లేదా అలా ఉంచుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయనుకుంటే అలాగే ఉంచుకుంటారు. ఇది ప్రతి ప్రభుత్వంలో జరిగేదే. అయితే విభజన అనంతరం ఏపీకి రాజధాని లేకపోవటం..అక్కడ నూతన రాజధాని ప్రాంతం ఎంపిక వంటి అంశాలు కీలకంగా మారటంతో ఇక్కడ రాజకీయ నేతలకు ‘స్కోప్’ ఎక్కువ పెరిగింది. ఇదే అదనుగా అప్పటి అధికార పార్టీ పెద్దలు..అప్పటి మంత్రులు..ఎమ్మెల్యేలు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. టీడీపీ హయాంలో రాజధాని భూమములకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
వాస్తవానికి రాజధాని భూముల్లో ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’ అన్న కోణాన్ని తొలుత బయటపెట్టింది కూడా Telugugateway.com మాత్రమే. అయితే స్టాక్ మార్కెట్ తరహాలోనే ఈ రాజకీయ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై చర్యలు తీసుకోవటం సాధ్యం అవుతుందా?. అంటే అది దాదాపు అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి అధికార వర్గాలు. అధికార వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి పనికొస్తుంది తప్ప ఈ సమాచారం ఆధారంగా చర్యలు సాధ్యం కాదని...ఇలాంటి కేసులు గతంలో ఎక్కడా కూడా లేవని చెబుతున్నారు. చాలా కాలం క్రితం టీడీపీ నేతలు ఎవరు ఎక్కడ ఎంతెంత భూములు కొన్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇఫ్పుడు కొత్తగా అధికార పార్టీ జాబితా బహిర్గతం చేసినా పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఉండదని..దీని ఆధారంగా చర్యలూ దాదాపూ అసాధ్యమే అని పేర్కొంటున్నారు. అదే స్టాక్ మార్కెట్లో అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటారు.
అక్కడ దీనికి సంబంధించిన నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఏదైనా కంపెనీ సమాచారం ముందుగా తెలుసుకుని ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా లావాదేవీలు జరిపి లాభాలు గడిస్తే అంతకు రెండు నుంచి మూడు రెట్లు జరిమానా విధించటంతోపాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇన్ సైడర్ నిరూపితం అయితే దీనికి పాల్పడిన వారు స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనకుండా మార్కెట్ నియంత్రణా సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్సైంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధిస్తుంది. స్టాక్ మార్కెట్ లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినా కూడా గుర్తించటమే చాలా సంక్లిష్టతలతో కూడిన వ్యవహారం. అలాంటిది రాజకీయ నేతలు తమ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా జరిపే లావాదేవీల ఆధారంగా చర్యలు తీసుకోవటం అనేది జరిగే పనికాదని చెబుతున్నారు. ఈ విషయంలో జగన్ సర్కారు ఎంత వరకూ విజయం సాధిస్తుందో వేచిచూడాల్సిందే.