జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై మార్కిస్టు విప్లవకారుడు చేగువేరా ప్రభావం ఎక్కువ అని చెప్పుకుంటారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే పలుమార్లు ప్రస్తావించారు. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా ఆయన ఇష్టం. కానీ ఆయన ముఖ్యమంత్రులను ‘రాజులు’గా భావిస్తున్నారా?. తన వ్యాఖ్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపదల్చుకున్నారు. లేకపోతే ప్రాసకోసం ప్రయాసపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా?. ‘రాజు మారితే రాజధాని మారాలా?’ అంటూ పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు అమరావతిలో ప్రశ్నించారు. అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ రాజులా...ప్రస్తుత సీఎం జగన్ ను రాజులా పవన్ పరిగణిస్తున్నారా?. ప్రజాస్వామ్యంలో రాజులు ఉండరనే విషయం పవన్ కళ్యాణ్ కు తెలియదా?. కొంత మంది ముఖ్యమంత్రులు రాజుల్లానే వ్యవహరిస్తూ ఉండొచ్చు. అలాంటి వ్యవహారశైలిని ప్రశ్నించాల్సింది పోయి..ఆయనే ముఖ్యమంత్రులను రాజులతో పోల్చటం ఏంటి? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ రాజధాని అమరావతికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజధాని అంశాన్ని పూర్తిగా గందరగోళంలోకి నెట్టాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై సమీక్ష చేసినా అమరావతిపై ఇంకా క్లారిటీ రాలేదు. బొత్స సత్యనారాయణ మాత్రం పదే పదే అక్కడ ఎక్కువ వ్యయం అవుతుందని చెబుతున్నారు. అదే నిజం అయితే అమరావతిలో ఎక్కువ వ్యయం అవుతుంది..పలానా చోట అయితే తక్కువ వ్యయం అవుతుంది అక్కడకు మారుస్తున్నాం అని అయినా చెప్పాలి. అలాంటి ప్రకటన ఏమీ చేయకుండా పదే పదే అవే మాటలు చెబుతూ ప్రజల్లో మాత్రం అనుమానాలు పెంచుతూ వస్తుంది వైసీపీ సర్కారు. ఇదే సాకుగా ప్రతిపక్ష టీడీపీపాటు బిజెపి, వామపక్షాలు, జనసేన పార్టీలు అమరావతి టూర్లు పెట్టుకుంటున్నారు. దీంతో ఇఫ్పుడు అమరావతి ఇప్పుడు అన్ని పార్టీలకు ఓ రాజకీయ అస్త్రంగా మారింది. చంద్రబాబు హయాంలో చేసినట్లు అమరావతి రైతుల అంశాన్ని ఈ సారి కూడా మధ్యలోనే వదిలేస్తారా? లేక చివరి వరకూ పవన్ కళ్యాణ్ వారితో ఉంటారా? వేచిచూడాల్సిందే.