నోటీసు లేకుండానే మచిలీపట్నం పోర్టు ఒప్పందం రద్దా?

Update: 2019-08-10 06:14 GMT

కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఏకంగా పోర్టు వంటి భారీ ప్రాజెక్టు వంటి ఒప్పందాలు రద్దు చేస్తారా?. ఇలా చేస్తే పారిశ్రామికవేత్తలకు భరోసా ఏమి ఉంటుంది?. ప్రభుత్వాన్ని నమ్మి ఎవరు ముందుకు వస్తారు?. చంద్రబాబునాయుడి హయాంలో ఏమైనా అక్రమాలు జరిగితే వాటిని సరిచేయాల్సిందే. ప్రజాధనం దోపిడీకి గురైతే అది రికవరి చేయాల్సిందే. దీంట్లో ఎవరికీ రెండవ అభిప్రాయం ఉండదు. కానీ జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం అటు అధికార వర్గాలను, ఇటు పారిశ్రామిక వర్గాలను షాక్ కు గురిచేస్తున్నాయి. విద్యుత్ ఒప్పందాల దగ్గర నుంచి తాజాగా మచిలీపట్నం ఓడరేవు ఒప్పందం రద్దు వరకూ తీసుకుంటున్న నిర్ణయాలు పారిశ్రామికవేత్తల్లో ఓ రకమైన భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వాస్తవానికి మచిలీపట్నం ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన పోర్టు పనులకు శ్రీకారం చుట్టింది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. ఆయన హయాంలో పోర్టు కోసం ఏకంగా 6262 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. కానీ ఆయన మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (ఐపీఏ) అభిప్రాయం తీసుకుని మరీ ఈ భూమిని 5324 ఎకరాలకు తగ్గించింది.

వాస్తవానికి తొలుత ఈ ప్రాజెక్టు అప్పట్లో మైటాస్ సంస్థకు దక్కింది. ఆ తర్వాత ఈ సంస్థ దివాళా తీయటంతో నవయుగా సంస్థ ఎంటరైంది. ఒప్పందం ప్రకారం పనులు చేయటంలో నవయుగా సంస్థ జాప్యం చేసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన, ఇస్తానన్న భూమి కూడా ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తే రహదారులతో పాటు ఇతర మౌలికసదుపాయల కల్పన సాధ్యంకాదని..ఒకసారి పనులు మొదలుపెడితే తర్వాత రేట్లు పెరిగి భూ సేకరణ మరింత జఠిలం అయ్యే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

నిజంగా జగన్ సర్కారు మచిలీపట్నం పోర్టు ఒఫ్పందం రద్దు చేయాలనుకున్నా నిర్మాణ సంస్థకు నోటీసు ఇచ్చి..కంపెనీ వివరణ తీసుకుని ముందుకెళ్లి ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇలా ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేయటం వల్ల కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలటం ఖాయం అని చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందం రద్దు ప్రక్రియను అత్యంత రహస్యంగా ఆపరేట్ చేశారని..జీవోవెలువడే వరకూ ఈ విషయంలో మౌలికసదుపాయాల శాఖలోని వర్గాలకు కూడా సమాచారం లేదని చెబుతున్నారు.

 

Similar News