ఇక సమరమే అంటున్న పాక్

Update: 2019-08-28 16:45 GMT

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అంశం భారత్-పాక్ ల మధ్య యుద్ధానికి దారితీస్తుందా?. ప్రస్తుతానికి అయితే ఆపరిస్థితి ఎక్కడ కన్పించటంలేదు. కానీ పాక్ మాత్రం నిత్యం ఏదో ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.తాజాగా ఆ దేశ మంత్రి ఇక యుద్ధమే మిగిలింది అంటూ ఓ ప్రకటన చేశారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌-భారత్‌ మధ్య అక్టోబర్‌-నవంబర్‌ మధ్య యుద్ధం రానుందంటూ వ్యాఖ్యానించారు. మరో స్వాతంత్ర్య యుద్ధం జరగనుందంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. రావల్పిండిలో బుధవారం మీడియాతో మాట్లాడారు.

"కాశ్మీర్ తుది స్వాతంత్ర్య పోరాటానికి సమయం ఆసన్నమైంది" పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికే పది యుద్ధాలు జరిగాయి.. కానీ ఇదే చివరి యుద్ధమని కూడా ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు. అనాగరిక, ఫాసిస్ట్ నరేంద్ర మోదీనే కాశ్మీర్ విధ్వంసానికి కారణమని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ మాత్రమే మోదీ కళ్లముందు కనిపిస్తోందనీ, ఈ సమస్యపై మిగతా ముస్లిం ప్రపంచం ఎందుకు మౌనంగా ఉందని షేక్ రషీద్ ప్రశ్నించారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా పరిగణించలేదని పేర్కొన్న ఆయన ప్రజాభిప్రాయ సేకరణకు పిలుపు నిచ్చారు. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఈ విషయాన్ని సెప్టెంబర్‌లో మరోసారి ఐరాస సర్వసభ్య సమావేశానికి తీసుకువెళతారన్నారు.

 

Similar News