తప్పు తేలకుండానే శిక్ష వేస్తారా?. విచారణ జరక్కుండానే దోష నిర్ధారణ చేస్తారా?. ఇదెక్కడి పద్దతి. ఇదీ ఐఏఎస్ వర్గాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై జరుగుతున్న చర్చ. గత ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పాడని పేరున్న అప్పటి పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ దగ్గర పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చూసిన జవహర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను కట్టెబెట్టింది. మాజీ సీఎం చంద్రబాబు పేషీలో పనిచేసిన గిరిజాశంకర్ కూ జగన్ సర్కారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ వంటి కీలక పదవే ఇచ్చింది. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాకూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరక్టర్ వంటి కీలక పదవే కట్టబెట్టారు. చంద్రబాబు జమానాలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా నారా లోకేష్ తో కలసి విదేశీ పర్యటనకు వెళ్లారు. అప్పట్లో అది పెద్ద దుమారమే రేపింది. గత ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయలను ఇతర శాఖలకు బదలాయించటంతోపాటు..పారిశ్రామిక రాయితీల కేటాయింపులో భారీ స్కామ్ కు పాల్పడ్డ ఓ ఉన్నతాధికారికి కూడా జగన్ సర్కారు పెద్ద పీట వేసింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలానే ఉంది. తప్పు చేసిన ఐఏఎస్ అధికారులను శిక్షిస్తే ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ జగన్ సర్కారు అందుకు భిన్నంగా కొంత మంది ఐఏఎస్ లపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందనే విమర్శలు మూటకట్టుకుంటోంది. గత సీఎంవోలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రతోపాటు కీలక బాధ్యతలు నిర్వహించిన సాయి ప్రసాద్, అజయ్ జైన్, శశిభూషణ్ కుమార్, చెరుకూరి శ్రీధర్ వంటి వారికి గత రెండు నెలలకు పైగా పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచటం అంటే ఇది ఓ తరహా వేధింపులే ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తనకు ఇష్టం లేని అధికారులను కొత్త ప్రభుత్వం అప్రాధాన్యత పోస్టుల్లో వేయటం ఎప్పటి నుంచో ఉందని..కనీసం అలాంటి పని కూడా చేయకుండా కావాలనే రెండు నెలలకు పైగా అధికారులను వెయిటింగ్ లో పెట్టడం కక్ష పూరితంగానే వ్యవహరిస్తున్నారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇలా వీరిని ఇంకెంత కాలం వెయిటింగ్ లో పెడతారో వేచిచూడాల్సిందే.