గంటా..మరి ఐదేళ్ళు ఏమి చేశారు?

Update: 2019-08-29 10:35 GMT

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొత్త డిమాండ్ పెట్టారు. అదేంటి అంటే విశాఖను ఆర్ధిక రాజధానిగా ప్రకటించాలని జగన్ సర్కారును కోరుతున్నారు. అదే పనిలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబునాయుడిని అడిగి ఉంటే చాలా ఈజీగా అయిపోయేదిగా?. కానీ ఐదేళ్ళు ఊరుకుండి ఇఫ్పుడు విశాఖను ఆర్ధిక రాజధాని చేయాలి. దీనికి అవసరమైన హంగులు అన్నీ విశాఖకు ఉన్నాయని ఇప్పుడు డిమాండ్ లేవనెత్తటం వెనక మతలబు ఏమిటి?. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.

అందులోనే ఈ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. అదే సమయంలో ఏపీ రాజధాని అమరావతిపై గందరగోళానికి తెరదించాలని ఆయన సూచించారు.ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడి స్పష్టత ఇవ్వాలని సూచించారు. విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని.. ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరారు. అమరావతి భూకుంభకోణం జరిగితే అధికారంలో ఉన్నవారు తేల్చాలన్నారు. రాజధాని కుంభకోణం ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు రాజకీయ నాయకులకు ఉంటుందన్నారు. అమరావతి వద్ద రూ.9వేల కోట్లు మౌలిక సదుపాయాలకే ఖర్చయిందని తెలిపారు.

 

Similar News