టీడీపీలో ఇక ‘యూత్’కే పెద్ద పీట

Update: 2019-08-13 07:54 GMT

రాబోయే రోజుల్లో ఇక యువతకు పెద్ద పీట వేయనున్నట్లు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. యువతకు 40 నుంచి 50 శాతం వరకూ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు మరోసారి గోదావరి జలాల వినియోగం అంశంపై ఏపీ సీఎం జగన్ తీరును తప్పుపట్టారు. జగన్, తెలంగాణ సీఎం కెసీఆర్ లు కలసి ఏపీకి అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ భూభాగం నుంచే గోదావరి జలాల వినియోగానికి ప్రణాళికలు రూపొందించాలి కానీ..450 కిలోమీటర్లు నీటిని తీసుకెళ్లి శ్రీశైలం నుంచి నీటిని తెస్తామనటం సరికాదన్నారు. ఇది ప్రజల సెంటిమెంట్ కు సంబంధించిన అంశం అని పేర్కొన్నారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుని చేసేది కాదని వ్యాఖ్యానించారు. జగన్ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై దాడులు విపరీతంగా పెరిగాయని..ఇలాగే చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు.

ప్రజా తిరుగుబాటు వస్తే అప్పుడు ఎవరూ ఉండరన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ పులివెందుల పంచాయతీలను రాష్ట్రంలో సాగనివ్వమన్నారు. శాసనసభలో తమకు కనీసం వాకౌట్ చేస్తున్నామనే విషయం చెప్పటానికి కూడా మైక్ రావటంలేదన్నారు. కేంద్రం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని..అందులో భాగంగానే ఆర్టికల్ 370 రద్దుకు సహకరించినట్లు తెలిపారు. తాము ఉచిత ఇసుక అందజేస్తే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పేదలను పీల్చిపిప్పి చేస్తోందని ఆరోపించారు. ఇసుక అందక నిర్మాణ రంగం స్తంభించిపోయిందని తెలిపారు.

 

Similar News