ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ‘అమరావతి’పై చేసిన వ్యాఖ్యలు రాజధాని ప్రాంతానికి సంబంధించి ప్రజల్లో మరింత అనుమానాలు పెంచేలా చేశాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతం విషయంలో జగన్ సర్కారు కొలువుదీరిన దగ్గర నుంచి పెద్దగా ప్రకటనలేమీ చేయకుండా సైలంట్ గా ఉంటోంది. అదే సమయంలో రాజధాని పేరుతో గత ప్రభుత్వంలో సాగిన దోపిడీ లెక్కలను బయటకు తీస్తోంది. ఈ విషయాలన్నీ తేలిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అటు రైతులు..ఇటు ప్రజల్లో అనుమానాలను మరింత పెంచాయి. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోందని అన్నారు. దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు.
తాజా వరదలతో ఈ ప్రాంతంలో ఎక్కువ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని..దీని నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, డ్యామ్ లు నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది కూడా సర్కారుపై అదనపు భారానికి కారణం అవుతుందని తెలిపారు. వరద నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటే ప్రజాధనం దుర్వినియోగం చేయటమే అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని..త్వరలోనే దీనిపై ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వం వెల్లడి చేసే ప్రకటనలోనే అన్ని విషయాలు ఉంటాయని తెలిపారు.