జగన్ సర్కారు కు హైకోర్టు ఝలక్..పోలవరం భవిష్యత్ ఏంటి?

Update: 2019-08-22 06:24 GMT

కొంత మంది అధికారులు భయపడినట్లే జరిగింది. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అనుమానంలో పడింది. విద్యుత్ ప్రాజెక్టుకు..పోలవరం సివిల్ వర్క్స్ కు కలిపి జగన్ సర్కారు ఒకే టెండర్ ను పిలవటంతో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పురోగతి అనుమానంలో పడింది. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేశానని చెప్పుకోవాలని ప్రయత్నించిన జగన్ సర్కారుకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. విద్యుత్ ప్రాజెక్టు రద్దు విషయంలో నిర్మాణ సంస్థ నవయుగా హైకోర్టును ఆశ్రయించింది. తాము పనులు చేయటానికి రెడీగా ఉన్నామని..షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తామని ప్రకటించింది. నిబంధనలకు విరుద్ధంగా తమ టెండర్ ను రద్దు చేశారని నవయుగా పేర్కొంది. అయితే ప్రభుత్వం తన వాదనలను కూడా విన్పించింది. జెన్ కో తాజాగా పిటీషన్ దాఖలు చేసి అసలు నవయుగా పిటీషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఈ తరుణంలో గురువారం నాడు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైడల్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. అదే సమయంలో రివర్స్ టెండరింగ్ ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు విషయం న్యాయవివాదాల్లో చిక్కుకున్నట్లు అయింది. ఇది ఎప్పటికీ తేలాలి?. ఎప్పుడు పనులు ప్రారంభం కావాలి అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోనుంది. హైకోర్టు ఆదేశాలు జగన్ సర్కారుకు పెద్ద ఝలక్ గానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు నవయుగా సంస్థతో ఓ ఒప్పందానికి వస్తే తప్ప..ఇఫ్పటికిప్పుడు పనులు ముందుకు సాగవు. జగన్ సర్కారు అలాంటి పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ కంపెనీపై సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంది. జెన్ కో నవయుగా హైడల్ ప్రాజెక్టు ను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలవరం హెడ్ వర్క్స్ కు మళ్ళీ విడిగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

Similar News