అజయ్ కల్లాంకు ఇప్పుడు ‘హాయిగా’ ఉందా?!

Update: 2019-08-09 07:31 GMT

‘చంద్రబాబు ఓ మీడియా సంస్థకు ఏపీ ప్రజల సొమ్మును వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు.’ ఇదీ మాజీ సీఎస్ అజయ్ కల్లాం ఎన్నికలకు ముందు పలుమార్లు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు. అందులో నిజం ఎంత?. నిజం ఉంటే దాన్ని సరిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలు ఏంటో ప్రస్తుతానికి ఎవరికీ తెలియదు. కానీ గత చంద్రబాబు సర్కారు చేస్తుందో ఇప్పుడు జగన్ సర్కారు కూడా అదే చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం జరిగిన రైతు దినోత్సవం సందర్భంగా ఏపీ సర్కారు కేవలం సాక్షి పత్రికకే దాదాపు ఆరు ఫుల్ పేజీల ప్రకటనలు ఇచ్చింది. అన్నీ కలర్ యాడ్సే. లార్జెస్ట్ సర్కులేటెడ్ డైలీ అయిన ఈనాడుకు రెండు పేజీల ప్రకటనలు ఇఛ్చారు. కానీ సాక్షికి మాత్రం ఆరు పేజీల ప్రకటనలు. చంద్రబాబునాయుడి హయాంలో సాక్షికి అప్పటి సర్కారు అసలు ప్రకటనలే ఇవ్వలేదు. ఇచ్చినా ఏదైనా అరకొర ప్రకటనలే.

ఎందుకంటే కారణం రాజకీయ వైరం. కొన్ని పత్రికలపై అవ్యాజ్యమైన ప్రేమ కురిపించిన మాట కూడా వాస్తవమే. మరి అప్పుడు చంద్రబాబు సర్కారు తీరును తప్పుపట్టిన అజయ్ కల్లాంకు ఇది తప్పుగా అన్పించటం లేదా?. ప్రస్తుతం ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం నాడు కూడా అలాంటిదే మరో ఘటన జరిగింది. ప్రపంచ ఆదివాసి దినోత్సవం పేరిట సాక్షి పత్రికకు మదటి పేజీలో హాఫ్ పేజీ కలర్ యాడ్ ఇచ్చుకున్నారు. ఈ యాడ్ ఇతర ప్రధాన తెలుగు పత్రికల్లో కన్పించలేదు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వారిష్టం వచ్చినట్లు యాడ్స్ ఇచ్చుకుంటారన్న మాట. చంద్రబాబు హయాంలో తప్పులను ఎత్తిచూపిన అజయ్ కల్లాం తన హయాంలో సాగుతున్న తప్పులను జగన్ దృష్టికి తీసుకెళ్ళగలరా?. మనకెందుకులే మన ఉద్యోగం మనకు ఉంటే చాలు అని మౌనంగా ఉంటారా?. వేచిచూడాల్సిందే.

 

 

 

 

 

Similar News