బిగ్ బ్రేకింగ్..కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు

Update: 2019-08-05 05:58 GMT

ఊహించినట్లుగానే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతోపాటు 35ఏను కూడా రద్దు చేస్తూ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కీలక బిల్లులను సభ ముందు ఉంచారు. అంతకు ముందు ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లు లు ప్రవేశపెట్టిన వెంటనే రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు నిరసన తెలిపారు. కనీసం సభ్యులకు బిల్లులో ఏముందో చదివే అవకాశం ఇవ్వకుండా ఇలా చేయటం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

అంతకు ముందు రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాబీనబీ ఆజాద్ మాట్లాడుతూ కాశ్మీర్ లో పరిస్థితిపై చర్చకు అనుమతించాలని కోరారు. ముందు హోం మంత్రి అమిత్ షా ప్రకటన తర్వాత అన్ని అంశాలపై చర్చకు అనుమతిస్తామని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కాశ్మీర్ లో పరిస్థితిని తన అదుపులోకి తీసుకుంది. తాము తీసుకునే సంచలన నిర్ణయాలపై స్పందనలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయం తెలుసుకాబట్టే కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రపతి గెజిట్ ద్వారానే ఆర్టికల్ 370 రద్దు జరుగుతుందని అమిత్ షా ప్రకటించారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజన కు సంబంధించిన బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు.

 

Similar News