అమరావతిని మారిస్తే అంగీకరించం

Update: 2019-08-27 08:09 GMT

ఏపీ రాజధాని అమరావతిని మార్చాలని యోచిస్తే అందుకు తాము అంగీకరించమని ఏపీ బిజెపి ప్రకటించింది. రైతులపక్షాన పోరాడతామని ఆ పార్టీ నేతలు తెలిపారు. మంగళవారం నాడు అమరావతిలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని బృందం పర్యటించింది. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి నేతలు మాట్లాడుతూ అమరావతిని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిని అందరూ ఆహ్వానించారని, జగన్‌ కూడా అమరావతిని స్వాగతించిచినట్టు గుర్తని కన్నా లక్ష్మినారాయణ అన్నారు. మాట తప్పం, మడమ తిప్పం అన్న నేతలు...ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జగన్‌ను విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక తప్పటడుగులు వేస్తోందని, ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, సీఎం నుంచి స్పందన రాలేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఆత్రం తప్ప, పని కన్పించడంలేదన్నారు. ప్రభుత్వంలో ఉన్నామని మరిచిపోయి... ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవినీతి అంటూ... వైసీపీ నేతలు కూడా అదే దారిలో పయనిస్తున్నారని కన్నా విమర్శించారు. చంద్రబాబుకు పట్టిన గతే వైసీపీకి పడుతుందని హెచ్చరించారు. అవినీతిని నిరూపించేందుకు ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాజధాని విషయంలో ఏం చేయబోతున్నారో జగన్‌ చెప్పాలని ఆయన నిలదీశారు. రాజధానిని మార్చుతామంటే బీజేపీ ఊరుకునే ప్రసక్తేలేదన్నారు.

రైతుల్లో నెలకొన్న భయాందోళనను సీఎం జగన్‌ పోగొట్టాలని కన్నా అన్నారు. ఒక రాజకీయ పార్టీని చూసి రైతులు రాజధానికి భూములు ఇవ్వలేదని, అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఇలా చేస్తుందని ఎవరూ ఊహించలేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజధాని పనులు ఆపటం లేదని మంత్రి బొత్స అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం సరికాదని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే కానీ రాజధాని అనేది తప్పనిసరని అన్నారు. ఎక్కడైనా అవినీతి జరిగితే దాని గురించి విచారణ చేయాలన్నారు.ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే ఉంటుందని, రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని బీజేపీ కోరుకుంటోందన్నారు. రాజధాని రైతులకు అన్ని విధాలా బీజేపీ అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

 

 

Similar News