ఎవరూ ఊహించని రీతిలో బిజెపి అప్పుడే ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుపై దాడి ప్రారంభించింది. స్థానిక నాయకులే కాకుండా..జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ జాబితాలో చేరటం విశేషం. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ళలో ఓ ప్రాంతీయ పార్టీ వల్ల ఏపీకి చాలా నష్టం జరిగిందని..అందుకే మరో పార్టీకి ఛాన్స్ ఇచ్చారన్నారు. ఈ ప్రభుత్వం వల్ల కూడా మేలు జరగకపోగా..కీడే ఎక్కువ జరుగుతోందని వ్యాఖ్యానించారు.
జగన్ అధికారంలోకి వచ్చి నిండా ఇంకా రెండు నెలల కాక ముందే బిజెపి ఈ తరహా దూకుడు చూపించటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడిన రాం మాధవ్ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. బిజెపితోనే ఏపీకి న్యాయం జరుగుతుందని అన్నారు. 2024 నాటికి ఏపీలో బిజెపి అతిపెద్ద పార్టీ గా అవతరించనుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో బిజెపిని బలోపేతం చేయాలని.. ఈ దిశగా నాయకులు చర్యలు చేపట్టాలని సూచించారు.