కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ జాబితాలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా చేరారు. అయితే తాను మే 19 తర్వాతే రాజీనామా చేశానని..అప్పటి నుంచి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతున్నా స్పందన లేదని తెలిపారు. రఘువీరారెడ్డి బుధవారం నాడు ఢిల్లీలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశాననన్నారు.
అధ్యక్ష బాధ్యతల నుంచి తనను తప్పించి మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూనే ఉన్నానని, అయితే ఇంతవరకూ రాజీనామాపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రఘువీరారెడ్డి తెలిపారు.