‘ఓ..బేబీ’ మూవీ రివ్యూ

Update: 2019-07-05 07:11 GMT

డెబ్బయి సంవత్సరాల ముసలావిడ ఓ 24 సంవత్సరాల అమ్మాయిగా మారిపోతే ఎలా ఉంటుంది?. అసలు అది సాధ్యం అవుతుందా? అనే సంగతి పక్కన పెట్టి చూస్తే ‘ ఓ...బేబీ’ సినిమా చూసేయవచ్చు. ఎవరి జీవితం అనుకున్నట్లు అనుకున్నదిగా ముందుకు సాగదనే విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు. అందులో చాలా మంది కన్న కలలు సమాధి అయిపోతాయి. అలాంటిదే బేబీ (లక్ష్మీ) కథ కూడా. పెద్ద సింగర్ గా గుర్తింపు పొందాలనుకున్న ఆమె మిలటరీలో పనిచేసే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది. యుద్ధంలోనే భర్త మరణించటంతో కష్టాలు పడి తన కొడుకు (రావు రమేష్) ను పెంచి పెద్ద చేస్తుంది. కొడుకు ప్రొఫెసర్ గా ఉన్నా..ఆమె మాత్రం ఓ క్యాంటీన్ నడుపుతూ జీవితాన్ని వెళ్ళదీస్తుంది. కానీ లక్ష్మీ తీరు నచ్చక కోడలు..మనవడు,మనవరాలు లక్ష్మీపై ఎప్పుడూ చికాకు పడుతుంటారు. చివరకు లక్ష్మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది.

ఓ ఎగ్జిబిషన్ లో జగపతిబాబు జాతకాలు చెప్పే వ్యక్తిగా బేబే చేతిలో ఓ వినాయకుడి విగ్రహం పెడతాడు. అంతే లక్ష్మీ 24 సంవత్సరాల సమంతగా మారిపోతుంది. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. 70 సంవత్సరాల ముసలావిడ నుంచి 24 సంవత్సరాల వయస్సు అమ్మాయిగా మారిన సమంత నడక దగ్గర నుంచి మాటలు..హావభావాలు..యాక్షన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా అంతా సమంత తన ఒంటి చేత్తో నడిపించిందనే చెప్పాలి. ఫస్టాఫ్ అంతా కామోడీతో సరదా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ లో మాత్రం సినిమా వేగం తగ్గుతుంది.

ఈ సినిమాలో ఇంకా చెప్పుకోవాలంటే రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి, ఊర్వశి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో నాగశౌర్యది నామమాత్రపు పాత్ర మాత్రమే. దక్షిణ కొరియాకు చెందిన సినిమా మిస్ గ్రానీ కథ ఆధారంగా దర్శకురాలు నందినీ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. వినాయకుడి విగ్రహం చేతిలో పెట్టగానే డెబ్బయి సంవత్సరాల వయస్సు ఉన్న లక్ష్మీ 24 సంవత్సరాల సమంతగా మారిపోతుంది. చివర్లో బేబీ ప్రెండ్ గా ఉన్న రాజేంద్రప్రసాద్ కూడా ఇదే టెక్నిక్ ను వాడి..అంటే వినాయకుడి విగ్రహాంతో నాగచైతన్యగా మారిపోతాడు. సో...ఇప్పుడు వినాయకుడి విగ్రహాలకు డిమాండ్ పెరుగుతుందేమో చూడాలి. ఓవరాల్ గా చూస్తే ఓ...బేబీ కామెడీ బేబీ.

రేటింగ్.3/5

Similar News