‘నినువీడని నీడను నేనే’ మూవీ రివ్యూ

Update: 2019-07-12 15:57 GMT

మనం అద్దంలో చూసుకుంటే మనమే కన్పిస్తాం. కానీ మనం అద్దంలో చూసుకుంటే మనం కాకుండా వేరే వాళ్ళు కన్పిస్తే. ఆ ఊహే విచిత్రంగా ఉంది కదా?. అవును అలాంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమానే ‘నినువీడని నీడను నేనే’. సందీప్ కిషన్ హీరోగా ఎన్నో సినిమాలు చేసినా..ఒక్క వెంకట్రాద్రి ఎక్స్ ప్రెస్ తప్ప మరో హిట్ లేదనే చెప్పొచ్చు. దీంతో తానే నిర్మాతగా మారి..వినూత్నమైన కథాంశంతో ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే చాలా సినిమాల తరహాలోనే ఇందులోనూ హీరో, హీరోయిన్ల ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరు. దీంతో హీరో అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (అన్యాసింగ్)లు పెద్దలు కాదన్నా పెళ్ళి చేసుకుని ముందుకు సాగుతుంటారు. కానీ సడన్ గా ఓ రోడ్డు ప్రమాదం జరుగుతుంది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ అద్దంలో చూసుకుంటే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కన్పిస్తూ ఉంటారు. దీనిపై డాక్టర్ దగ్గరకు వెళితే అసలు విషయం చెబుతాడు?. సినిమాలో కొన్ని సన్నివేశాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటే..మరికొన్ని అత్యంత గందరగోళంలోకి నెడతాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.

తనకు బాగా పట్టున్న కామెడీతో పాటు హారర్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ లోనూ వేరియేషన్స్ చూపించాడు. హీరోయిన్ ఆన్య సింగ్ తెలుగులో తొలి సినిమానే అయినా మంచి మార్కులు కొట్టేసింది. లుక్స్‌ పరంగా ఆకట్టుకున్న అన్యా సింగ్ నటనలోనూ పరవాలేదనిపించింది. మరో కీలక పాత్రలో నటించిన వెన్నెల కిశోర్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, ప్రగతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సందీప్‌ కిషన్‌ తొలిసారిగా నిర్మాతగా మారుతున్న సినిమా కోసం ఆసక్తికర కథను రెడీ చేశాడు తమిళ దర్శకుడు కార్తిక్‌ రాజు. ఈ సినిమాలోనూ తమన్ తన మార్క్‌ చూపించాడు. ఓవరాల్ గా చూస్తే నినువీడని నీడని నేనే గతంలో వచ్చిన ఆత్మల సినిమాలకు ఒకింత భిన్నమైన మూవీ.

రేటింగ్.2.5/5

 

Similar News