అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట చెబుతున్నారు. అదేంటి అంటే తాము పారదర్శకంగా ఉంటాం అని. కొద్ది రోజుల క్రితం పెట్టుబడులు, మౌలికసదుపాయాల శాఖలో ఓ రహస్య జీవో వచ్చింది. అది వాస్తవానికి ఓ పోస్టింగ్ కు సంబంధించిన అంశం. కానీ సోషల్ మీడియాలో, వాట్సప్ లోనూ కొంత మంది ఔత్సాహికులు మచిలీపట్నం పోర్టును తెలంగాణ సర్కారుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని..ఏకంగా 8000 ఎకరాలు కేటాయించారని వార్తలు పెట్టారు. అసలు ఆ జీవోను రహస్యంగా పెట్టడం వల్లే వచ్చిన సమస్య ఇది. సోషల్ మీడియాలో ఉండే వ్యక్తులుకు ఏ జీవో ఎలా వస్తుందో తెలిసే అవకాశం లేదు. కొంత మంది ఉధ్దేశపూర్వకంగా కూడా ఆ ప్రచారం చేసి ఉండొచ్చు కూడా రాజకీయం కోసం. కానీ అసలు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన నారా లోకేష్ కూడా వారి జాబితాలో చేరటమే విచిత్రం. ఇన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ కు విధాన నిర్ణయాలకు సంబంధించిన జీవోలు ‘ఆర్ టి’ అంటే రొటీన్ జీవోగా రావనే విషయం తెలియదా?. మరి మంత్రిగా ఆయన ఇంత కాలం మంత్రిగా ఏమి చేసినట్లు. ఆ జీవోలో స్పష్టంగా ఆర్ టి అని ఉంది. కీలకమైన ఆదేశాలు..విధాన నిర్ణయాలకు సంబంధించి ఖచ్చితంగా జీవో ఎంఎస్ అనే జారీ చేస్తారు.
కానీ ఇదేమీ పట్టించుకోని లోకేష్ అసలు కనీసం ఆ జీవో ఏంటి?. ఆర్ టి జీవోకు ఎంఎస్ జీవోకు తేడా చూసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తన సహాజశైలిలో ‘ట్విట్టర్’వేదికగా విమర్శలు చేశారు. పోర్టుపై సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికీ లేదు. మచిలీపట్నం పోర్టు విషయంలో ప్రజల్లో ఉన్న అనుమానాలకు జగన్ సమాధానం ఇవ్వాలంటూ లోకేష్ ట్వీట్ చేశారు. జూన్ 28న జీవో ఆర్ టి 62 రహస్య జీవో జారీ చేసి..తర్వాత జారీ చేయలేదు అని మార్చారని లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. అసలు మంత్రికి ఆర్ టి జీవో ద్వారా మచిలీపట్నం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులను నిజంగా ఎవరికైనా అప్పగించవచ్చా?. అందుకు అవకాశం ఉందా? లేదా అనే విషయం అవగాహన లేకపోవటం అన్నది చాలా దారుణం అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టీడీపీ నేతలు కూడా అసలు విషయం తెలుసుకోకుండానే దీనిపై విమర్శలు గుప్పిస్తున్నాయి.